Share News

ఏఐ పోస్టుల్లో మూడోవంతు ఖాళీ

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:54 AM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను అక డమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. అనేక పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి.

ఏఐ పోస్టుల్లో మూడోవంతు ఖాళీ

36 పోస్టులకు అభ్యర్థులు కరువు

విధుల్లో చేరేందుకు 42 మంది విముఖత

163 మంది మాత్రమే చేరిక

ఒంగోలు విద్య, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను అక డమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. అనేక పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. జిల్లాకు 104 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, 137 స్కూలు అసిస్టెంట్లు మొత్తం 241 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల (ఏఐ) పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేక 36 మిగిలిపోగా 205 మందిని ఎంపిక చేశారు. వీరిలో 42 మంది వివిధ కారణాలతో విధుల్లో చేరేందుకు విముఖత చూపారు. దీంతో 241 పోస్టుల్లో 163 మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన మూడో వంతు పోస్టులు అంటే 78 ఖాళీగా మిగిలిపోయాయి. ఏఐ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వం వచ్చే అక్టోబరులో మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసి రెగ్యులర్‌ ప్రాతిపదికన టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏఐలకు డిమాండ్‌ తగ్గినట్లు తెలుస్తోంది. వారికి గౌరవ వేతనంగా ప్రకటించిన ఎస్‌జీటీకి రూ.10వేలు, స్కూలు అసిస్టెంట్‌కు రూ.12,500కు అశపడి ఇక్కడ పనిచేసే కన్నా డీఎస్సీకి ఇప్పటి నుంచే శిక్షణ పొంది రెగ్యులర్‌ పోస్టులు సాధించడం మేలన్న ఉద్దేశంతో ఈ పోస్టులకు నిరుద్యోగ టీచర్లు ఆసక్తి చూపలేదు. కాగా పాఠశాలల్లో ఖాళీ టీచర్‌ పోస్టుల ప్రభావం విద్యార్థులపై పడకుండా వారికి మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 08 , 2026 | 02:54 AM