Share News

నాల్గోవంతు రిటన్‌

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:07 AM

దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఇంకా కుదుటపడలేదు. కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులు కావస్తున్నా అన్ని కేంద్రాల్లో రోజువారీ వేలం కొనసాగడం లేదు. రోజు మార్చి రోజు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో మూడు జిల్లాల్లో మొత్తం 11 కేంద్రాలు ఉండగా ఒక రోజు ఆరు, మరోరోజు ఐదు చోట్ల వేలం నిర్వహిస్తున్నారు.

నాల్గోవంతు రిటన్‌

కుదుటపడని పొగాకు మార్కెట్‌

నెల గడుస్తున్నా మారని తీరు

నేటికీ రోజు మార్చి రోజు వేలం

ఒంగోలు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఇంకా కుదుటపడలేదు. కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులు కావస్తున్నా అన్ని కేంద్రాల్లో రోజువారీ వేలం కొనసాగడం లేదు. రోజు మార్చి రోజు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో మూడు జిల్లాల్లో మొత్తం 11 కేంద్రాలు ఉండగా ఒక రోజు ఆరు, మరోరోజు ఐదు చోట్ల వేలం నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాలకు అమ్మకాల కోసం రోజువారీ బోర్డు అధికారులు అనుమతించే బేళ్ల సంఖ్య కూడా పరిమితంగానే ఉంటోంది. వాటిని కూడా వ్యాపారులు సరైన ధరకు కొనుగోలు చేయకుండా రకరకాల కారణాలతో తిరస్కరిస్తున్నారు. దక్షిణాదిలో బుధవారం వేలం కొనసాగిన తీరును పరిశీలిస్తే అమ్మకాలకు వచ్చిన బేళ్లలో నాల్గవవంతు తిరస్కరణలు జరిగాయి. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లోని ఒంగోలు-1, టంగుటూరు, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లోని పొదిలి, కందుకూరు-1, కలిగిరి కేంద్రాల్లో బుధవారం వేలం జరిగింది. మొత్తం ఐదు కేంద్రాల్లో కలిపి 1,935బేళ్లను బోర్డు అధికారులు అనుమతించగా 1,446 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 489 బేళ్లను తిరస్కరించారు. అంటే అమ్మకానికి తెచ్చిన బేళ్లలో సుమారు 25.27శాతం తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో బోర్డు అధికారులు ప్రకటించిన ధరలకు ఏ కంపెనీ వారు కొనుగోలు చేయక అధికారులే ఆపేసిన(నోబిడ్‌) బేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 19.48శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. అలాంటివి ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో 14.05 శాతం ఉన్నాయి. అధికంగా ఒంగోలు-1 కేంద్రంలో ఏకంగా 26.09శాతం, పొదిలిలో 16.32 శాతం, కందుకూరు-1లో సుమారు 15.99శాతం బేళ్లు నోబిడ్‌ అయ్మాయి. మరోవైపు ధరలు పెరగకపోగా క్రమంగా తగ్గిపోతున్నాయి. లెక్కకు ప్రారంభం నాటి ధర కిలో రూ.250 కొద్ది బేళ్లకు ఇస్తున్నప్పటికీ ఎక్కువశాతం ధర కిలో రూ.235కు చేరడంతో సగటు తగ్గిపోతుంది.

Updated Date - Apr 23 , 2026 | 03:07 AM