ఒక నగరం.. ఒక గంట
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:52 AM
ఒంగోలులో మరో భారీ ప్రత్యేక కార్యక్రమ నిర్వహణకు అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ఒంగోలు మునిసిపాలిటీ ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 28నుంచి 30 వరకు విభిన్న కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు.
ఒంగోలులో వ్యర్థాల విభజనకు భారీ కార్యక్రమం
శతాబ్దిన్నర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న నిర్వహణ
విస్తృత ఏర్పాట్లలో యంత్రాంగం
80వేల ఇళ్లు, దుకాణాల నుంచి సేకరణ
బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నిలిచే లక్ష్యం
మూడు రోజుల క్రితం ఒకే రోజు 150 వైద్య శిబిరాలు
ఒంగోలు, సెప్టెంబరు 16 (ఆంధ్ర జ్యోతి) : ఒంగోలులో మరో భారీ ప్రత్యేక కార్యక్రమ నిర్వహణకు అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. ఒంగోలు మునిసిపాలిటీ ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 28నుంచి 30 వరకు విభిన్న కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఒకవైపు నగర సుందరీకరణ, మౌలిక సదుపాయాల మెరుగు.. మరోవైపు ప్రజాచైతన్య కార్యక్రమాలు, పర్యావరణ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులోభాగంగా ఈనెల 19న నగరం అంతటా ‘ఒక నగరం - ఒక గంట’ పేరుతో భారీ వ్యర్థాల విభజన ప్రత్యేక కార్యక్రమం (మెగా సెగ్రిగేషన్ డ్రైవ్) నిర్వహించ నున్నారు. ఆ రోజు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య గంట వ్యవధిలో నగర పరిఽధిలో ఉన్న సుమారు 80వేల గృహాలు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనున్నారు. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ కార్యక్రమ నమోదు లక్ష్యంగా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గత రెండేళ్లుగా నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తున్నారు. పలు అంశాలలో కొంతమేర పరిస్థితి మెరుగ వగా ప్రస్తుతం ఒంగోలు మునిసిపా లిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తి సందర్భం రావడంతో మరింతగా ప్రజల్లోకి నగరా భివృద్ధిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్ రాజాబాబుతో కలిసి విభిన్న అంశాలపై దృష్టి పెట్టారు. నగర సుందరీకరణకు ప్రాధాన్యం ఇచ్చి పలుచోట్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చేశారు. పార్కులు, రోడ్లు, ఇతరత్రా పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ క్రమంలో 150 ఏళ్లకు గుర్తుగా 20 మంది జిల్లా ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు కార్యక్రమం గతనెల 28న నిర్వహించారు. మంత్రి లోకేష్ స్థానిక బైసాస్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద వాటితోపాటు జిల్లాకు గర్వకారణమైన ఒంగోలు గిత్త విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే నగరం హోదా కన్నా 30 ఏళ్లలో తాగునీటి సమస్యను తీర్చేలా రూపొందించిన రూ.402 కోట్ల తాగునీటి పథకం పనులను ప్రారంభించారు. ఇక నెలాఖరులో 150 ఏళ్ల ఉత్సవాలు పెద్దఎత్తున జరగనుండగా ఈలోపు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా మూడు రోజుల క్రితం నగరంతోపాటు ఒంగోలు నియోజకవర్గవ్యాప్తంగా ఒకే రోజున 150 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 119 హాస్పిటల్స్‌కు చెందిన 680 మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొని దాదాపు 22వేల మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
గంట వ్యవధిలోనే స్పెషల్ డ్రైవ్
తాజాగా మరో భారీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పారిశుధ్యం ప్రధానంగా స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర పేరుతో ప్రతినెలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ (భారీ వ్యర్థాల విభజన ప్రత్యేక కార్యక్రమం)ను చేపడుతున్నారు. గత ఏడాది ఇలాగే ఒకే రోజున వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఐదు వేల మొక్కలు కొద్ది వ్యవధిలోనే నాటారు. అలా ఈసారి ఒక గంట వ్యవధిలో నగరంలో వ్యర్థాల విభజన స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై మంగళవారం రాత్రి కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భేటీ అయి చర్చించారు. ఒడా చైర్మన్ షేక్ రియాజ్, కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఈ కార్యక్రమం నమోదు లక్ష్యంగా పెట్టుకున్నారు.