Share News

రోడ్డు ప్రమాదం కేసులో ఒకరి అరెస్టు

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:45 AM

గంజాయి అక్రమ రవాణా చేస్తూ కారుతో ఆటోను ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక సబ్‌డివిజన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం వివరాలను వెల్లడించారు.

రోడ్డు ప్రమాదం కేసులో ఒకరి అరెస్టు
యాక్సిడెంట్‌ కేసులో పట్టుబడిన డ్రైవరు సాయికుమార్‌తో కేసు వివరాలను వెల్లడిస్తున్న కందుకూరు డీఎస్పీ, గుడ్లూరు సీఐ, ఎస్‌ఐ తదితరులు

రెండు బ్యాగులలో 19 కిలోల గంజాయి స్వాధీనం

వివరాలను వెల్లడించిన కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

కందుకూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : గంజాయి అక్రమ రవాణా చేస్తూ కారుతో ఆటోను ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక సబ్‌డివిజన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం వివరాలను వెల్లడించారు. ఆ ప్రకారం.. ఒడిసా నుంచి చెన్నైకి కారులో ఇటీవల గంజాయి తీసుకెళ్తున్న స్మగ్లర్లు 16వ నెంబరు జాతీయ రహదారిపై గుడ్లూరు మండలం వీరేపల్లి వద్ద ముందు వెళ్తున్న కూలీల ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలోని అన్నద మ్ములు మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న రెండు సంచుల్లోని గంజాయిని సమీపంలోని ఓ కల్వర్టులో పడేసి కారు వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. ఆరోజే రెండు బ్యాగుల గంజాయిని, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో కీలకమైన డ్రైవరు తురిమెళ్ల సాయికుమార్‌ను మంగళవారం అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన సాయికుమార్‌.. చరణ్‌ అనే వ్యక్తివద్ద డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తరచూ చరణ్‌ గదికి సాయికుమార్‌ వెళ్లేవాడు. అక్కడికి వచ్చే సతీష్‌, జగదీష్‌ అనే యువకులతో చరణ్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో చరణ్‌ ఆలోచన మేరకు నలుగురూ కలిసి ఒడిసా నుంచి చెన్నైకి గంజాయిని అక్రమంగా తరలించేవారు. అక్కడ అధిక ధరకు విక్రయించే వ్యాపారం ఎంతోకాలంగా చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి కోసం ఒడిసాకు వెళ్లిన సతీష్‌ మోటారుసైకిల్‌పై గంజాయి తీసుకుని వస్తున్నాడు. పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద మోటారుసైకిల్‌ మరమ్మతులకు గురైంది. దీంతో సతీష్‌ తన మిత్రుడైన చరణ్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. ఆయన వెంటనే సాయికుమార్‌, జగదీష్‌లను వెంటబెట్టుకుని తన కారులో యడ్లపాడు వద్దకు చేరుకున్నాడు. సతీష్‌ను ఎక్కించుకుని తిరిగి చెన్నై వస్తున్న సమయంలో వీరేపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారును వదిలేసి గంజాయి బ్యాగులను దూరంగా వదిలేసి వారు నలుగురూ పరారయ్యారు. ఈ క్రమంలో సోమవారం సాయికుమార్‌ ప్రమాదస్థలికి చేరుకున్నాడు. ఆ ప్రాంతంలో గంజాయి బ్యాగుల కోసం గాలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుడ్లూరు పోలీసులు వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. దీంతో వివరాలను నిందితుడు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న చరణ్‌, సతీష్‌, జగదీష్‌లతో పాటు మరికొందరి కోసం గాలింపు ముమ్మరం చేశామని వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయిని మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 19 కిలోలు ఉన్నట్లు తేలిందన్నారు. దీనివిలువ రూ.1.90 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితుడు సాయికుమార్‌ను గంజాయి, ప్రమాదానికి కారణమైన కారుతో సహా కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 02:45 AM