మిరపకాయల కోతలకు వెళ్తూ మృత్యుఒడికి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:58 PM
మిరపకాయల కోత కు వెళ్తూ మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో మహిళా కూలీ మృతి చెందింది.
రెండు ఆటోలఢీ.. మహిళా కూలీ మృతి, ఏడుగురికి గాయాలు
పెద్ద దోర్నాల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : మిరపకాయల కోత కు వెళ్తూ మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో మహిళా కూలీ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామ పొలాల వద్ద బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నదోర్నాలకు చెందిన మానేపల్లి నాగేశ్వరమ్మ(50) మృతి చెందగా, వెంకటమ్మ, గురవయ్య, వెంకటేశ్వర్లు, పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన ఏ కాశయ్య, ఎం.శంకరాచారి, దివ్య, సీహెచ్ మల్లారెడ్డికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నదోర్నాలకు కొందరు కూలీలు ఆటోలో తమ్మడపల్లి గ్రామంలో మిరపకాయల కోతలకు వెళ్తుండగా పెద్ద బొమ్మలాపురం పొలాల వద్దకు వెళ్లగానే ఆగ్రామం నుంచి మరో ఆటోలోప్రయాణికులతో ఎదురుగావస్తూ వేగం అదుపు తప్పి కూలీల ఆటోను ఢీకొట్టింది. దీంతో రెండు ఆటోల్లో ప్రయాణిస్తున్న కూలీలు కింద పడడంతో దెబ్బలు తగిలాయి. గమనించిన కొందరు 108కి సమాచారం ఇవ్వడంతో ఆంబులెన్స్‌లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించగా పరిస్థితి విషమించి నాగేశ్వరమ్మ మృతిచెందింది. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వెంకట రమణయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.