చివరి రోజు భారీగా...
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:36 AM
జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఏర్పాటుచేసిన క్లస్టర్‌లలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిం చారు.
సర్పంచ్‌ల కోసం 950, వార్డు సభ్యులకు 3,474
తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఏర్పాటుచేసిన క్లస్టర్‌లలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిం చారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లోని 139 సర్పంచ్ పదవులకు, 1,396 వార్డుసభ్యుల పదవులకు నామినేషన్లను దాఖలు చేశారు. మూడురోజుల పాటు ప్రక్రియ కొనసాగగా సర్పంచ్‌లకు 950 నామినేషన్లు, వార్డు సభ్యులకు 3,474 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు స్వీకరిస్తున్న కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తును కల్పించారు. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన జరగనుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంఽధిత అధికారులు చేపట్టారు.
పంచాయతీల్లో పోలింగ్ రోజు సెలవు
ఒంగోలు విద్య, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే రోజుల్లో ప్రభుత్వం స్థానిక సెలవు లను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 26, 29, వచ్చేనెల 2వ తేదీన మూడు విడతలుగా పంచాయతీలలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉత్పత్తికి ఆటంకం కలగకుండా అవసరమైతే మరో సెలవు రోజును పనిదినంగా ప్రకటించుకోవచ్చని స్పష్టం చేసింది. అది కూడా సాధ్యం కాని పక్షంలో పోలింగ్ సమయంలో కనీసం మూడు గంటల పాటు ఉద్యోగులకు విధుల నుంచి వెసులుబాటు కల్పించి వారు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించింది.