అద్దంకి వైసీపీలో ముసలం
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:12 AM
అద్దంకి నియోజకవర్గ వైసీపీలో ముసలం పుట్టింది. ఇప్పటికే సరైన నాయకత్వం లేక పలువురు నేతలు, కార్యకర్తలు స్తబ్దుగా ఉన్నారు. ఈక్రమంలో తాజాగా ముగ్గురు మండల కన్వీనర్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు.
పదవులకు రాజీనామా చేసిన ముగ్గురు మండల కన్వీనర్‌లు, పలు అనుబంధ సంఘాల నేతలు
అసంతృప్తిలో సంతమాగులూరు జడ్పీటీసీ సభ్యుడు
నియోజకవర్గ సమన్వయకర్త తీరుపై విమర్శలు
అద్దంకి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి నియోజకవర్గ వైసీపీలో ముసలం పుట్టింది. ఇప్పటికే సరైన నాయకత్వం లేక పలువురు నేతలు, కార్యకర్తలు స్తబ్దుగా ఉన్నారు. ఈక్రమంలో తాజాగా ముగ్గురు మండల కన్వీనర్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ తీరు, ఏకపక్షధోరణికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు బల్లికురవ, పంగులూరు మండలాల కన్వీనర్‌లు దేవినేని కృష్ణబాబు, రావూరి శ్రీనివాసరావు, బల్లికురవ మండల అనుబంధ సంఘాల నేతలు పత్తిపాటి అక్కయ్య, శింగమ్మ, సతీష్ తదితరులు ఆదివారం ప్రకటించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న తరుణంలో కార్యకర్తలకు అండగా ఉన్న తమను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న అశోక్‌కుమార్ దూరంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో వైసీపీని వర్గాలుగా విభజించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సంతమాగులూరు మండల వైసీపీ కన్వీనర్‌గా ఉన్న ఊట్ల నాగేశ్వరరావు పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో శనివారం వీడియో పోస్టు చేశారు.
మరికొందరు కూడా పార్టీని వీడే అవకాశం
సంతమాగులూరు జడ్పీటీసీ సభ్యుడైన సీనియర్ నేత అడవి శ్రీనివాసరావు కూడా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తీవ్రంగా అవమానించారన్నారు. బల్లికురవ మండలంలోని పలు అనుబంధ సంఘాల నేతలు కూడా తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. మొత్తం మీద నియోజకవర్గంలో సగం మంది మండల కన్వీనర్‌లు రాజీనామా చేసినట్లు అయ్యింది. వీరందరిపై వైసీపీ అధిష్ఠానం ద్వారా నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్‌కుమార్ సస్పెన్షన్ వేటు వేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోది. ప్రస్తుతం ఉన్న కన్వీనర్‌లు పాణెం హనిమిరెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో నియమించిన వారు కావడంతో అందరినీ తొలగించి కొత్త వారిని నియమించుకునే ఆలోచనలో డాక్టర్ అశోక్‌కుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా పార్టీ పదవులను వీడే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.