Share News

అయ్యో పాపం!

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:42 AM

ఒంగోలు నగర పరిధిలోని చెరువు కొమ్ముపాలెంలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు చెరువులో మృతదేహమై తేలాడు. గ్రామంలోని దుర్గ నర్సింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న ప్రత్యూష కుమారుడు రిచర్డ్స్‌ రేయాన్స్‌(6) మంగళవారం కళాశాల గేటు తీసుకొని బయటకు వచ్చి కనిపించకుండా పోయాడు.

అయ్యో పాపం!
చెరువులో గాలింపు చర్యలు చేపడుతున్న అగ్నిమాపక దళం

అదృశ్యమైన బాలుడి మృతదేహం చెరువులో లభ్యం

అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వెలికితీత

ఒంగోలు క్రైం, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర పరిధిలోని చెరువు కొమ్ముపాలెంలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు చెరువులో మృతదేహమై తేలాడు. గ్రామంలోని దుర్గ నర్సింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న ప్రత్యూష కుమారుడు రిచర్డ్స్‌ రేయాన్స్‌(6) మంగళవారం కళాశాల గేటు తీసుకొని బయటకు వచ్చి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించింది. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్వీయ పర్యవేక్షణలో బాలుడి ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలు, డాగ్‌ స్క్వాడ్‌లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కళాశాల గేటు వద్ద నుంచి స్నీపర్‌ డాగ్‌ గ్రామ శివారులోని గుర్రంవారి చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయింది. దీంతో రాత్రంతా ఫ్లడ్‌లైట్లతో పోలీసులు చెరువుకట్ట చుట్టూ గాలించారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. వాహన రాకపోకల వివరాలను తీసుకున్నారు. బుధవారం తెల్లవారగానే ఒంగోలు డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, సీఐ విజయకృష్టల ఆధ్వర్యంలో అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దించారు. ప్రత్యేక బోటుతో గుర్రంవారి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అదేసమయంలో బాలుడి మృతదేహం నీటిపైకి తేలింది. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాదం అలముకుంది. బాలుని మృతదేహం చూసి బంధువులు, గ్రామస్థులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులు ప్రత్యూష, చంద్రశేఖర్‌లు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - Jul 09 , 2026 | 02:42 AM