అమ్మో.. ప్రైవేటు బస్సులు
ABN , Publish Date - Sep 23 , 2026 | 02:42 AM
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో ప్రయా ణం దినదినగండంగా మారింది. ట్రావెల్స్ పేరుతో సుదూర ప్రాంతాలకు వెళుతున్న బస్సులలో సరైన ప్రమాణాలను పాటించడం లేదు. క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానా లకు చేర్చాల్సిన బస్సులలో డైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
మద్యం సేవించి పట్టుబడిన డ్రైవర్
తరచూ దొరుకుతున్న వైనం
నిత్యం తనిఖీలు నిర్వహిస్తాం : ట్రాఫిక్ సీఐ
ఒంగోలు క్రైం, సెప్టెంబరు 22 (ఆంధ్ర జ్యోతి) : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో ప్రయా ణం దినదినగండంగా మారింది. ట్రావెల్స్ పేరుతో సుదూర ప్రాంతాలకు వెళుతున్న బస్సులలో సరైన ప్రమాణాలను పాటించడం లేదు. క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానా లకు చేర్చాల్సిన బస్సులలో డైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇష్టానుసారంగా మద్యం సేవించి బస్సులు నడుపుతూ ప్రమా దాలకు కారణమవుతున్నారు. ఇటీవల వరుసగా ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులు బయల్దేరే సమయంలో డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఒంగోలులోని మంగమూరు రోడ్డు జంక్షన్, అద్దంకి బస్టాం డ్లలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నారు. సోమవారం రాత్రి ఒంగోలులో మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద నిర్వహించిన పరీక్షల్లో విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడుపుతున్నట్లు గుర్తించారు. వెంటనే అతనిని అక్కడ దించివేసి మరో డ్రైవర్‌ను ఎక్కించి ప్రయాణికులను బెంగళూరు తరలించారు. గతంలో కూడా అనేకమార్లు ప్రైవేటు బస్సు డ్రైవర్లు మద్యం సేవించి బస్సు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య తెలిపారు.
ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
ప్రైవేటు బస్సుడ్రైవర్లు ఇలా వరసగా మద్యం సేవించి పోలీసులకు పట్టుబడుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్సు ప్రయాణం అంటే భయపడుతున్నారు. వరుస ప్రమాదాలతోపాటుగా డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపడం ప్రయాణికులకు మరింత షాక్‌గా మారింది. దీంతో ప్రైవేటు బస్సు ప్రయాణం అంటే అమ్మో అంటున్నారు.
నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం
ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య
ఒంగోలు నగరంలో అద్దంకి బస్టాండ్, మంగమూరురోడ్డు జంక్షన్‌ల వద్ద నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య తెలిపారు. గతంలో కూడా ఇలా మద్యం సేవించి బస్సు నడుపుతున్న డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో పట్టుబడ్డారని వివరించారు. బస్సు డ్రైవర్లకు రాత్రులు పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నామన్నారు.