Share News

అయ్యో..

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:39 AM

మార్కాపురం జీజీహెచ్‌లో బస్సు ప్రమాద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. 14 మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. శనివారం ఉదయం వారి బంధువులకు అప్పగించారు.

అయ్యో..
మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి తీసుకెళ్తున్న సిబ్బంది (ఇన్‌సెట్‌లో) విలపిస్తున్న ప్రభావతి, చైత్రి కుటుంబ సభ్యులు

మార్కాపురం వైద్యశాలలో మిన్నంటిన రోదనలు

బస్సు ప్రమాద మృతదేహాలు బంధువులకు అప్పగింత

డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తింపు

అంబులెన్స్‌ల్లో స్వగ్రామాలకు తరలించిన అధికారులు

ప్రత్యేకంగా పోలీసు ఎస్కార్ట్‌ ఏర్పాటు

‘అయ్యో.. ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కనీసం మొఖం కూడా కనిపించడం లేదే.. ఇలాంటి కష్టం పగవాళ్లకు కూడా రావద్దు..’ అంటూ మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన అంబటి అనిల్‌ సోదరి బోరున విలపించారు. ప్రమాదంలో అనిల్‌తోపాటు ఆయన ఐదు నెలల కుమారుడు సజీవదహనమయ్యారు. వారిని తలచుకొని అనిల్‌ సోదరి విలపించిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పరిహారం ఇస్తే ప్రాణాలు తిరిగి రావు కదా? కనీసం మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.5లక్షలు లేక 10 లక్షలతో బస్సులను బాగుచేయండి అని ఆమె ప్రభుత్వాన్ని కోరడం ఆలోచింపజేసింది.

‘బిడ్డ ఇంటికి వస్తుందని ఆనందంతో ఉన్నాం. కానీ మృతదేహంతోపాటు మరణ ధ్రువీకరణ పత్రం చేతికి వచ్చింది. ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. త్వరగా వచ్చేందుకు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి’ అంటూ ప్రమాదంలో మృతి చెందిన ప్రభావతి, బాలిక చైత్రి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇలా.. మార్కాపురం జీజీహెచ్‌లో బస్సు ప్రమాద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. 14 మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. శనివారం ఉదయం వారి బంధువులకు అప్పగించారు. గుర్తుపట్టని విధంగా కాలిపోయిన మృతదేహాలను చూసి వారు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. తమ వాళ్లను తలచుకొని కుమిలిపోయారు. ఒక్కొక్కరు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ విషణ్ణ వదనాలతో వైద్యశాల నుంచి అంబులెన్స్‌ల్లో మృతదేహాలను వారివారి సొంతూళ్లకు తీసుకెళ్లారు.

మార్కాపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): బస్సు ప్రమాదంలో అయినవాళ్లను పోగొట్టుకున్న వారు ఏడ్చిఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. రెండు రోజులుగా వైద్యశాల వద్ద మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న బంధువులు, తోబుట్టువులకు శనివారం భౌతికకాయాలను అప్పగించిన సందర్భంలో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. తెల్లటి వస్త్రాల్లో చుట్టి ఇచ్చిన మృదేహాలను చూసి కనీసం కడసారి ముఖం కూడా చూసుకునే వీలులేని ఇలాంటి కష్టం పగవాళ్లకు కూడా రాకూడదంటూ కొందరు రోదించిన తీరు అక్కడ ఉన్న అందరినీ కంటతడి పెట్టించింది. మార్కాపురం సమీపంలో గురువారం చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 5 నెలల బాలుడు, ఆరేళ్ల బాలికతో కలిపి మొత్తం 14 మంది సజీవదహనమైన సంగతి విదితమే. మృతదేహాలు గుర్తుపట్టేందుకు వీలు లేకుండా నల్లని మాంసం ముద్దలుగా మారాయి. వాటిని మార్కాపురం జీజీహెచ్‌లోని మార్చురీలో భద్రపరిచారు. డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా వాటిని గుర్తించి శనివారం ఉదయం బంధువులకు అప్పగించారు. ఒక్కో మృతదేహానికి ఒక్కో అంబులెన్స్‌తోపాటు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించారు. మృతదేహాల అప్పగింత సమయంలో బంధువులు, తోబుట్టువులు తమ వాళ్లను తలచుకొని కన్నీరుమున్నీరయ్యారు. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లెకు చెందిన ఉప్పు రమాదేవి మృతదేహాన్ని తీసుకునే సమయంలో బంధువులు చేసిన ఆర్తనాదాలకు దిక్కులు పిక్కటిల్లాయి. కుమారుడు మనోహర్‌తో కలిసి బస్సులో వచ్చిన రమాదేవి ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను బయటకు నెట్టింది. ఆమె అగ్నికి ఆహుతైంది. తన కళ్లముందే తల్లిని కోల్పోయానని రోదిస్తున్న మనోహర్‌ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా వారి బంధువులు రమాదేవి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

Updated Date - Mar 29 , 2026 | 02:40 AM