Share News

అధికారుల జల'క్‌

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:51 PM

చందవరం-1 సాగర్‌ జలాల స్టోరేజీ నుంచి వారం రోజులుగా దొనకొండకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మండల పరిధిలోని 28 గ్రామాల ప్రజలు మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధికారుల జల'క్‌
చందవరం-1 స్టోరేజీలో సమృద్ధిగా ఉన్న సాగర్‌ జలాలు

చందవరం -1 స్టోరేజీ ట్యాంక్‌ నుంచి నిలిచిన తాగునీటి సరఫరా

నీటి నిర్వహణ కాంట్రాక్ట్‌ గడువు ముగిసి ఐదు నెలలు

అధికారికంగా పునరుద్ధరించని పాలకులు

వారం రోజుల నుంచి నీళ్లు పూర్తిగా బంద్‌

28 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

దొనకొండ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి) : చందవరం-1 సాగర్‌ జలాల స్టోరేజీ నుంచి వారం రోజులుగా దొనకొండకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మండల పరిధిలోని 28 గ్రామాల ప్రజలు మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాజెక్ట్‌ నీటి సరఫరా నిర్వహణ కాంట్రాక్ట్‌ ఈ ఏడాది మార్చితో ముగిసింది. ఉన్నతాధికారుల నుంచి కాంట్రాక్ట్‌ పునరుద్ధరణ ఉత్తర్వులు రాలేదు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్టర్‌ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతనాలు ఇవ్వలేదనే కారణంతో ఈనెల 1 నుంచి సిబ్బంది నీటి సరఫరా నిలిపివేసి విధులు బహిష్కరించారు. అనంతరం అధికారులు.. కాంట్రాక్టర్‌, సిబ్బందితో చర్చించి ఈనెల 9 నుంచి నీటి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు.

ప్రస్తుతం కాంట్రాక్టర్‌కు నీటి సరఫరా నిర్వహణ చేపట్టే బాధ్యతలపై ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు లేని కారణంగా నిర్వహణ చేపట్టలేనని చేతులెత్తేశారు. ప్రాజెక్ట్‌ నీటి సరఫరా నిర్వహణ బాధ్యతలపై అధికారికంగా ఉత్తర్వులు లేకపోవటంతో భవిష్యత్తులో బిల్లులు మంజూరవుతాయో, లేదో అనే సందేహంతో తప్పుకుంటున్నానని అధికారులకు ఆ కాంట్రాక్టర్‌ లిఖితపూర్వకంగా అందజేసినట్లు సమాచారం. కాంట్రాక్టర్‌ తప్పుకోవటంతో తమకు వేతనాల చెల్లిస్తారో, లేదో అనే సందేహంతో కాంట్రాక్టు సిబ్బంది సైతం వారం రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. దీంతో చందవరం-1 స్టోరేజీ నుంచి గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది.


అసలే ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవక భూగర్భజలాలు అడుగంటి బోర్లకు నీరందని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి సమయంలో స్టోరేజీలో సమృద్ధిగా సాగర్‌ నీళ్లు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరఫరా నిలిచిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదేవిధంగా కొనసాగితే తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చందవరం-1 సాగర్‌ జలాల సరఫరా బాధ్యతలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Aug 19 , 2026 | 11:51 PM