అధికారులు కావలెను!
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:58 AM
జిల్లాలో గృహనిర్మాణ శాఖ.. అధికారుల కొరతతో సతమతమవుతోంది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉండాలి.
హౌసింగ్‌లో వేధిస్తున్న కొరత
నాలుగు డీఈ, రెండు ఈఈ పోస్టుల్లో ఒక్కరే
అన్నిచోట్లా కనిగిరి డీఈ పర్యవేక్షణతో పనులు
ఉద్యోగ కాలం పొడిగింపుతో కొనసాగుతున్న పీడీ
మార్కాపురం, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గృహనిర్మాణ శాఖ.. అధికారుల కొరతతో సతమతమవుతోంది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉండాలి. అయితే కనిగిరిలో ప్రస్తుతం ఉన్న డీఈ ఎం.కోటిరెడ్డి అక్కడ ఈఈతో పాటు మార్కాపురం ఈఈగానూ, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మూడుచోట్ల డీఈగానూ ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్నారు. అంటే జిల్లా మొత్తం పరిపాలన, సాంకేతిక అనుమతులు, బిల్లుల చెల్లింపులు అంతా ఆయనపైనే ఆధారపడి గృహ నిర్మాణ శాఖ నడుస్తోంది. ఇక కొంతకాలం క్రితం గృహ నిర్మాణశాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులైన మోహన్‌రావు కూడా జూన్ 30తో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఆయన తనకు రెండేళ్ల పొడిగింపు ఉత్తర్వులు అమలు చేయాలని కోర్టును ఆశ్రయించి న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు కొనసాగుతున్నారు. లేకుంటే పీడీగా కూడా ఉన్న ఒక్క అధికారే అదనపు బాధ్యతలు చూడాల్సిన పరిస్థితి వచ్చేది. గతంలో మార్కాపురం, కనిగిరి ఈఈలుగా ఉన్నవారు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అప్పట్లో అక్కడ డీఈలుగా ఉన్న ఇద్దరికి ఈఈలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత మార్కాపురం డీఈ ఏప్రిల్ ఆఖరున, గిద్దలూరు డీఈ మే ఆఖరున, ఎర్రగొండపాలెం డీఈ జూన్ ఆఖరున వరుసగా ఉద్యోగ విరమణ చేశారు. ఇక కనిగిరి డీఈ ఒక్కరే మిగిలారు. నాలుగు చోట్ల డీఈ బాధ్యతలు, మార్కాపురం, కనిగిరి డివిజన్‌లలో ఈఈ బాధ్యతలు అన్నీ ఆయనకే అప్పగించారు. పక్కా గృహాల నిర్మాణంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తక్షణమే మార్కాపురం జిల్లాలో అధికారుల కొరతపై దృష్టి సారించి భర్తీ చేయాల్సి ఉంది. లేకుంటే ఆశయం నీరుగారే పరిస్థితి నెలకొంది.