యంత్రాంగం జనబాట
ABN , Publish Date - May 08 , 2026 | 02:57 AM
ఒకనెల-ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మండలం యూనిట్‌గా అందులో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఒక నెలలో నాలుగుసార్లు అధికారులు ఆ గ్రామాన్ని సందర్శిస్తారు.
ఒక నెల - ఒక గ్రామం పేరుతో నెలలో నాలుగు సార్లు సందర్శన
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం... భూసమస్యలపై ప్రత్యేక దృష్టి
జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమం
తహసీల్దార్ల నేతృత్వంలో అన్నిశాఖల అధికారులు భాగస్వామ్యం
దర్మవరంలో ప్రకాశం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి,
సూరావారిపల్లిలో మార్కాపురం జేసీ శ్రీనివాసులు హాజరు
ఒంగోలు, మే 7 (ఆంధ్రజ్యోతి): ఒకనెల-ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మండలం యూనిట్‌గా అందులో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఒక నెలలో నాలుగుసార్లు అధికారులు ఆ గ్రామాన్ని సందర్శిస్తారు. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా తహసీల్దార్ నేతృత్వంలో ఆ గ్రామంలో సంబంధిత రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటారు. అదేసమయంలో ఎంపీడీవోలు, ఇతర కీలక శాఖల మండల స్థాయి అధికారులంతా పాల్గొని ప్రజల నుంచి వచ్చే వినతులను పరిష్కారించి ప్రభుత్వానికి నివేదించాలి. వారంలో ఒకరోజు, నెలలో నాలుగు వారాల్లో నాలుగు రోజులు ప్రజల చెంతకు అధికార యంత్రాంగం వెళ్లాల్సి ఉంటుంది. ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వారు కాకుండా అన్ని మండలాల్లో ఒకేరోజు ఈ కార్యక్రమం సాగేలా ప్రతి గురువారం ఇలా గ్రామానికి వెళ్లి సభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ కార్యక్రమం రెండు జిల్లాల్లోనూ గురువారం అన్ని మండలాల్లో ప్రారంభమైంది.
భూసంబంధ సమస్యలపైనే దృష్టి
అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రకాశం జేసీ కల్పనాకుమారి పాల్గొన్నారు. కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జేసీ పులి శ్రీనివాసులు, ఉలవపాడు మండలం చాగల్లు గ్రామసభకు కందుకూరు సబ్‌కలెక్టర్ డి.హిమవంశీ హాజరయ్యారు. ఆర్డీవోలు కొన్నిచోట్ల పాల్గొన్నారు. ప్రధానంగా తహల్దార్ల ఆధ్వర్యంలో గ్రామసభలు జరిగాయి. ప్రధానంగా భూసంబంధ సమస్యలపైనే దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి వరుసగా నాలుగు గురువారాలు ఆ గ్రామానికి తహసీల్దార్ నేతృత్వంలో అఽధికారులు వెళ్తారు. తొలివారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. అవకాశం ఉన్న వాటిని తక్షణం పరిష్కరిస్తారు. మిగతా వాటిని తీసుకొని రెండో వారం గ్రామానికి వచ్చినప్పుడు సంబంధిత రికార్డులను పరిశీలిస్తారు. మూడోసారి వెళ్లినప్పుడు అలాంటి వాటిని పరిష్కరిస్తారు. ఇక నాల్గో వారం గ్రామానికి వెళ్లినప్పుడు తమకు అందిన అర్జీలు, పరిష్కారం చేసిన వాటి వివరాలను పూర్తిగా గ్రామసభలో ప్రకటిస్తారు. ఆమేరకు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కొన్నిచోట్ల గ్రామసభలకు అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలు కూడా హాజరైనట్లు సమాచారం.