Share News

ఆక్రమించు.. అమ్మేయ్‌..

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:19 AM

ఎర్రగొండపాలెం మండలంలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే కబ్జా చేస్తున్నారు. దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వారికి రెవెన్యూ అధికారులు, నాయకుల అండ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆక్రమించు.. అమ్మేయ్‌..
మిల్లంపల్లి వద్ద నాల్గోతరగతి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి

రెచ్చిపోతున్న కబ్జాదారులు

మిల్లంపల్లి వద్ద నాల్గో తరగతి ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పాగా

దొంగ పట్టాలు సృష్టించి విక్రయం 8 ఒక్కోప్లాట్‌ రూ.5లక్షలకు బేరం

ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో కనిపించని రికార్డులు

ఎర్రగొండపాలెం రూరల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం మండలంలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే కబ్జా చేస్తున్నారు. దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వారికి రెవెన్యూ అధికారులు, నాయకుల అండ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మల్లింపల్లి వద్ద రూ.కోట్ల విలువైన భూమిని ఆక్రమించి విక్రయిస్తుండటం కబ్జారాయుళ్ల బరితెగింపును తెలియజేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగొండ పాలెం-మాచర్ల జాతీయ రహదారి వెంట మిల్లంపల్లి పంచాయతీలోని సర్వే నెంబర్‌ 139/5లో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 1992-94 మధ్య కాలంలో సుమారు 117మంది నాల్గో తరగతి ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున నివేశన స్థలాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకూ అక్కడ ఎలాంటి నిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టలేదు. స్థలాలు పొందిన వారిలో కొందరు విక్రయించుకున్నట్లు తెలు స్తోంది. మరికొందరు ఇతర ప్రాంతాలలో ఉండగా ఇంకొందరు మృతి చెందినట్లు సమా చారం. ఇటీవల భూముల రేట్లు పెరగడంతోపాటు మార్కాపురం జిల్లా కావడం, జాతీయ రహదారి వెంట మిల్లంపల్లి పంచాయతీ ఉండడంతో ఈ స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. సుమారు 30 ఏళ్లుగా అవి ఖాళీగా ఉండటంతో వైసీపీ పాలనలో కొందరు వాటిపై కన్నేసి కబ్జా చేశారు. అప్పట్లోనే కొన్ని స్థలాలకు దొంగ పట్టాలు సృష్టించారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో మరికొన్ని ప్లాట్లలో టీడీపీ నాయకులు పాగా వేశారు. అందరూ కలిసి ఒక్కో స్థలం రూ. 4లక్షల నుంచి రూ.5లక్షల వరకూ విక్రయిస్తున్నారు.

ఆ రికార్డులు ఎక్కడ?

రెవెన్యూ శాఖలో ఆ భూములకు సంబందించిన రికార్డులు భద్రంగా ఉండాలి. కానీ ఎర్రగొండపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో చాలా వరకు రికార్డులు తారుమారైనట్లు తెలుస్తోంది. కబ్జాకు గురైన ఈ స్థలానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా రికార్డులు కనిపించడకపోవడం ఇందుకు ఉదాహరణ. ఇది ఒక్కటే కాదు.. ఇలా చాలా వరకు భూ రికార్డులు మాయమైనట్లు సిబ్బందే చర్చించుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ డి.మంజునాథరెడ్డిని వివరణ కోరగా.. లే ఆవుట్‌ అయితే ఉందని, లబ్ధిదారుల జాబితా అందుబాటులో లేదని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 03:19 AM