Share News

విచారణకు విఘాతం

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:34 AM

దర్శి నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో చోటుచేసు కున్న అక్రమాలపై విచారణ అటకెక్కింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ విచారణాధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. కొంతమంది కీలక అధికారులు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే బదిలీ చేయించుకొని వెళ్లారు.

విచారణకు విఘాతం

ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం

పంచాయతీల్లో అక్రమాలపై ఎంక్వైరీ ఉద్దేశపూర్వకంగా జాప్యం

బదిలీపై వెళ్లిన అధికారులు

అక్రమార్కులు తప్పించుకునే అవకాశం

కొన్నిచోట్ల ప్రత్యేకాధికారుల తటపటాయింపు

దర్శి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : దర్శి నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో చోటుచేసు కున్న అక్రమాలపై విచారణ అటకెక్కింది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసినప్పటికీ విచారణాధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. కొంతమంది కీలక అధికారులు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే బదిలీ చేయించుకొని వెళ్లారు. ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దర్శి మండలంలోని తూర్పువెంకటాపురం, రాజంపల్ల్లి, తాళ్లూరు మండలంవిఠలాపురం పంచాయతీలతోపాటు కురిచేడు, దొనకొండ పంచాయతీల్లో అక్రమాలపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. రాజంపల్లి, విఠలాపురం పంచాయతీల వివాదం కోర్టులో నడుస్తోంది. కొన్ని పంచాయతీలకు నియమించిన విచారణాధికారులు బదిలీ అయ్యారు. అక్రమాలకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శులు కూడా బదిలీ చేయించుకొని వెళ్లారు. దర్శి మండలంలోని జముకులదిన్నె, శామంతపూడి తదితర గ్రామాల్లో పనిచేసిన కొంతమంది కార్యదర్శులు ఎలాంటి పనులు చేయకుండానే అడ్డగోలుగా నిధులు డ్రా చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు గ్రామాల్లోనే దాదాపు రూ.25 లక్షల వరకు గోల్‌మాల్‌ చేసినట్లు సమాచారం. ఆయా గ్రామాల్లో చేపల చెరువుల డబ్బులు కూడా లాగేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ నాయకుల అండదండలతో పంచాయతీ కార్యదర్శులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. అదేక్రమంలో కొందరు సర్పంచ్‌లు కూడా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో విచారణ జరుగుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమాలపై నిగ్గు తేల్చలేదు. అన్ని దశల్లో అధికారులు ఈ విషయాన్ని మరుగున పడేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్‌ల పదవీకాలం కూడా ముగిసి ప్రత్యేకాధికారులను నియమించారు. వారే పంచాయతీల పాలన నిర్వహించాల్సి ఉంది. అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్న పంచాయతీలకు నియమితులైన ప్రత్యేకాధికారులు విధులు నిర్వహించే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఎక్కడైనా లోపం జరిగితే తాము కూడా ఇబ్బందిపడాల్సి వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో కూడా ఇదేతంతు కొనసాగే అవకాశం ఉంది.

Updated Date - Apr 04 , 2026 | 02:34 AM