శింగరకొండ రాజగోపురాల పునర్నిర్మాణానికి అడ్డంకులు
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:56 PM
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పలువురు దాతల సహకారంతో సుమారు రూ.20 కోట్లతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించాలని ధర్మకర్తల మండలి, దేవదాయశాఖ అధికారులు నిర్ణయించి సిద్ధమయ్యారు.
ముందుకు వచ్చిన దాతలు
ఒకరిద్దరు అభ్యంతరంతో ఆలస్యమయ్యే అవకాశం
అద్దంకి, జనవరి 19(ఆంధ్రజ్యోతి) : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పలువురు దాతల సహకారంతో సుమారు రూ.20 కోట్లతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించాలని ధర్మకర్తల మండలి, దేవదాయశాఖ అధికారులు నిర్ణయించి సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధాంతులు, దేవదాయశాఖ స్థపతి, పలువురు ప్రముఖులను సంప్రదించగా ప్రస్తుతం ఉన్న రాజగోపురాలతోపాటు ప్రాకారం వాస్తువిరుద్ధంగా ఉందని, వెంటనే పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు. దీంతో పులువురు దాతలను సంప్రదించగా నాలుగు రోజగోపురాలు నిర్మాణం, ప్రాకారం నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించేందుకు ముందుకువచ్చారు. జనవరి నెల చివర్లో పనులు ప్రారంభించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే సుమారు రూ.6 కోట్లతో దేవాలయం ముఖమండపం పునర్నిర్మాణం పూర్తయింది.
దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు
ఆలయం చుట్టూ రాజగోపురాలు, ప్రాకారం పూర్తయితే మొత్తం నల్లరాతితో నిర్మాణం పూర్తవుతుందని అందరూ భావించారు. మూడు దశాబ్దాల క్రితం రాజగోపురాలు నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలలో ఒకరిద్దరు పునర్నిర్మాణానికి అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మాణం చేసే రాజగోపురాలకు పాత దాతలే ముందుకు వస్తే వాళ్లకే మరలా అవకాశం ఇవ్వాలని భావించారు. అప్పట్లో రాజగోపురాలు నిర్మించిన దాతలలో ఒకరు మాత్రమే ముందుకొచ్చారు. మిగిలిన ముగ్గురులో ఇద్దరు మాత్రం పునర్నిర్మాణానికి ఇతర దాతలతో చేయించుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని దేవాలయ అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకరు మాత్రం పునర్నిర్మాణం తమ వల్ల కాదని, అదే సమయంలో పాత రాజగోపురం తొలగించటానికి వీలులేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేవదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అదే సమయంలో మిగిలిన దాతలను కూడా తన వైపు తిప్పుకునేందుకు అతను ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాజగోపురాలు, ప్రాకారం పునర్నిర్మాణ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
సత్రాలు, ముఖ మండపం, ధ్వజ స్తంభం, తదితర అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో అప్పట్లో విరాళాలు ఇచ్చిన ఏ దాతలు అభ్యంతరం పెట్టకపోగా.. ప్రస్తుతం ఒకరిద్దరు దాతలు అభ్యంతరం పెట్టి అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి దేవాలయ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.