ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:51 PM
న్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు పీవీఆర్ మునిసిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి హరిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఒంగోలు కల్చరల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు పీవీఆర్ మునిసిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలలో భాగంగా ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి హరిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు మాట్లాడుతూ సినీరంగంలోనూ, రాజకీయరంగంలోనూ తనదైన ముద్రతో, నిబద్ధతతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు. అంతేకాకుండా తెలుగుజాతి కీర్తిపతాకను జాతీయస్థాయిలో ఎగురవేశారని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, వెల్‌విషర్ శంకర్, బెజవాడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బల్లికురవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోలాట ప్రదర్శన అలరించింది. కోలాట శిక్షకులు బండారు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు పలు జానపద గీతాలకు తాళలయబద్ధంగా కోలాటాన్ని ప్రదర్శించారు. అనంతరం గుంటూరుకు చెందిన శ్రీ సాయి మంజీర ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన తెలుగుతల్లి నృత్యరూపకం తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, తెలుగుభాష వైభవం, పరిరక్షణ ఆవశ్యకతలను చాటిచెప్పేలా కొనసాగింది. ప్రముఖ నృత్య శిక్షకులు కాజా వెంకట సుబ్రహ్మణ్యం ఈనృత్యరూపకానికి దర్శకత్వం వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కల్చరల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పొడపాటి అశ్వని ప్రసంగించారు.