Share News

ఇక డబుల్‌ ఎంట్రీల వంతు

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:11 AM

ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా డబుల్‌ ఎంట్రీలు (ఒకే వ్యక్తికి రెండు ఓట్ల)పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు ‘సర్‌’ జరిగిన ప్రాంతాల్లో ఆ జిల్లా పరిధిలోనే డబుల్‌ ఎంట్రీలను పరిశీలించగా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం పంపనుంది.

ఇక డబుల్‌ ఎంట్రీల వంతు

ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి

మరో నాలుగైదురోజుల్లో ఇతర

రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాలు

ఫొటోల ఆధారంగా గుర్తింపు ప్రక్రియ

ఇప్పటికే అందుకు సంబంధించిన

విధివిధానాలపై కసరత్తు

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా డబుల్‌ ఎంట్రీలు (ఒకే వ్యక్తికి రెండు ఓట్ల)పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు ‘సర్‌’ జరిగిన ప్రాంతాల్లో ఆ జిల్లా పరిధిలోనే డబుల్‌ ఎంట్రీలను పరిశీలించగా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం పంపనుంది. వాటిని మన జిల్లా ఓటర్ల జాబితాలతో సరిచూసి డబుల్‌ ఎంట్రీలు ఉంటే గుర్తించనున్నారు. అందుకోసం నూతన సాంకేతిక విధానాన్ని అనుసరించనున్నారు. ఫొటో మ్యాచ్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (డబుల్‌ ఎంట్రీలు) ద్వారా ఓట్లను గుర్తించనున్నారు. ఒకే వ్యక్తికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, మన జిల్లాలో ఓటు ఉంటే అటువంటి వారిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాజధాని హైదరాబాద్‌లో, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ప్రస్తుత విభజిత రాష్ట్రానికి చెందిన ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీర్ఘకాలంగా అక్కడే ఉంటూ ఎన్నికల సమయంలో మన రాష్ట్రానికి పెద్దఎత్తున వచ్చి ఓట్లు వేసి వెళ్తుంటారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ కొందరు జీవిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ‘సర్‌’ ప్రక్రియ ముగిసి ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబరు 3వతేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించే విధంగా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఇచ్చింది. ఆ లోపు దేశంలో ఒక వ్యక్తికి ఒక ఓటు అనే విధానంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు సమీప రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అటువంటి వారి ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను ఇతర రాష్ట్రాల నుంచి పంపనున్నట్లు సమాచారం. ఆ ఓటర్ల జాబితాలు వచ్చిన వెంటనే ప్రస్తుతం మన జిల్లాలో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలతో సరిచూసి ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే ఫొటో ఆధారంగా గుర్తించి తొలగించనున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 03:11 AM