ఓటర్లకు నోటీసులు
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:57 AM
జిల్లాలో 1.96 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసిన అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన విషయం విదితమే.
జిల్లాలో 1.96 లక్షల మందికి సిద్ధం
అందులో 29,136 మంది నోమ్యాపింగ్
మరో 1.67 లక్షల మంది పేర్లలో తప్పులు
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 1.96 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసిన అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన విషయం విదితమే. సర్ ప్రక్రియలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం మ్యాపింగ్ చేయించుకోని 29,136 మంది ఓటర్లతోపాటు తాజా జాబితాలో ఓటుహక్కు ఉన్న వారి పేర్లలో కూడా తప్పులు దొర్లాయి. అటువంటివి జిల్లావ్యాప్తంగా 1.67 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు సమగ్రమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించడంతో తదనుగుణంగా చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన 1.96 లక్షల మంది ఓటర్లకు నోటీసుల జారీకి ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమవుతున్నారు. నోమ్యాపింగ్ ఓట్లతోపాటు జాబితాలో ఇంటి పేరు లేదా పేరులో అక్షర దోషాలు ఉన్న వారికి ఈ నోటీసులు ఇవ్వనున్నారు. వీటిని అందుకోనున్న వారిలో దర్శి నియోజకవర్గంలో 33,806 మంది, అద్దంకి నియోజకవర్గంలో 26,636 మంది, సంతనూతలపాడు నియోజకవర్గంలో 24,978 మంది, ఒంగోలు నియోజకవర్గంలో 38,071 మంది, కందుకూరు నియోజకవర్గంలో 16,626 మంది, కొండపి నియోజకవర్గంలో 27,088 మంది ఉన్నారు.