సమీక్షలే కాదు.. సపమస్యలూ చూస్తా
ABN , Publish Date - May 06 , 2026 | 02:46 AM
‘కేవలం సమీక్షలతోనే సరిపెట్టే వ్యక్తిని కాదు.. క్షేత్రస్థాయిలో సమస్యలనూ తెలుసుకుంటా. టన్నెల్ లోపల కార్మికుల కష్టాన్ని స్వయంగా చూస్తా’ అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రిపూట వెలిగొండ టన్నెల్లోకి వెళ్లారు.
రాత్రిపూట టన్నెల్లోనే ఉంటా
వెలిగొండ పనుల పరిశీలనలో మంత్రి నిమ్మల
మార్కాపురం / పెద్దదోర్నాల, మే 5 (ఆంధ్రజ్యోతి) : ‘కేవలం సమీక్షలతోనే సరిపెట్టే వ్యక్తిని కాదు.. క్షేత్రస్థాయిలో సమస్యలనూ తెలుసుకుంటా. టన్నెల్ లోపల కార్మికుల కష్టాన్ని స్వయంగా చూస్తా’ అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రిపూట వెలిగొండ టన్నెల్లోకి వెళ్లారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను నిర్దేశించిన సమయానికి పూర్తిచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉండటంతో జలవనరుల శాఖ మంత్రిగా ఆయన నిత్యం అధికారులను అప్రమత్తం చేస్తూ ఇప్పటికి ఐదుసార్లు టన్నెళ్ల వద్దకు వచ్చి పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. గతనెల 7వ తేదీన శ్రీశైలం నుంచి వెలిగొండ హెడ్‌రెగ్యులేటరీ ఉన్న కొల్లంవాగు వద్దకు బోటులో ప్రయాణించారు. అక్కడ నుంచి 19 కి.మీ. దూరం టన్నెల్ లోపల ప్రయాణించి పనులు చూస్తూ దోర్నాల వైపు చేరుకున్నారు. మళ్లీ మంగళవారం టన్నెల్ వద్దకు చేరుకున్న ఆయన అధికారులతో సమీక్షించి పనుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. కార్మికుల కష్టాన్ని స్వయంగా చూసిన ఆయన.. ఐదు గాంట్రీల వద్ద ఉన్న కార్మికులు, మిషనరీలకు మధ్య సమన్వయం పెంచి పనుల లక్ష్యాన్ని తానే సూచిస్తానని టన్నెల్ లోపలకు వెళ్లారు. చీకటిగా ఉన్నప్పటికీ అక్కడక్కడా అమర్చి ఉన్న లైట్ల వెలుగుల మధ్య ఆయన అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. లైనింగ్ జరుగుతున్న చోట బురద నీటి మధ్య కాళ్లు కూరుకుపోయినా లెక్క చేయకుండా పర్యవేక్షణ కొనసాగించారు. మంత్రిగా ఉన్న ఆయన స్వయంగా అది కూడా రాత్రిపూట పనులు చూసేందుకు చేసిన ప్రయత్నం కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపుతుందని భావిస్తున్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న మిషనరీ కూడా తొలగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత, కార్మికుల కొరత వంటి అంశాలను అధిగమించి అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
గొడ్డలి పార్టీతో అప్రమత్తంగా ఉండాలి
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా సస్యశ్యామలం చేసేందుకు తపిస్తుంటే రప్పా రప్పా అంటూ భయభ్రాంతులకు గురిచేసే జగన్ గొడ్డలి పార్టీతో ప్రజలు అప్రమత్తంగాఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై టన్నెల్ సందర్శనకు మంగళవారం మార్కాపురం జిల్లా దోర్నాల వచ్చిన మంత్రి ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై నెలలుగా ప్రాజెక్టు పూర్తి కోసం యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నామన్నారు. ఫ్లోరైడ్ రహిత తాగునీరు, పంటలకు సాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తూ కోట్లాది రూపాయలు వెచ్చించి, పనులపై వారం వారం సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటికీ పనులు చాలా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరి గత ఎన్నికల ముందు ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం చేస్తున్నామని జగన్ చెప్పడం ప్రజలను దగా చేయడం కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో రాయలసీమకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పైగా ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తుంటే వైసీపీ నాయకులు నిధులు కేటాయించాలని, ఇంకా ఏవేవో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆ విషయమై ముందు వాళ్ల అధినాయకుడిని ప్రశ్నించాలన్నారు. అదిగాక ప్రజాసంక్షేమం కోసం పోరాడాల్సిన నాయకులు రప్పా రప్పా అంటూ కత్తులు గొడ్డళ్లు చూపిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని, ఆ విషయం ప్రజలు గమనించాలని కోరారు.