ఊసేలేదు!
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:03 AM
అత్యంత కీలకమైన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ)ని పాలకపక్షం గాలికొదిలేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం గురించి పట్టించుకున్న వారు లేరు. గతంలో జరిగి ఏడు నెలలు దాటినా దాని ఊసే లేదు.
ఏడు నెలలు దాటినా.. డీఆర్సీ ఏదీ?
కీలక సమావేశం నిర్వహణపై ఉదాసీనత
ప్రజా ప్రభుత్వం వచ్చాక మూడు సార్లే !
జిల్లా పునర్విభజన తర్వాత ఒక్కసారీ ఏర్పాటు చేయని వైనం
మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ఉన్నట్లా.. లేనట్లా.. అర్థం కాని పరిస్థితి
పథకాల అమలు, ప్రజా సమస్యలపై కొరవడిన ఉమ్మడి జిల్లా నేతల దృష్టి
అత్యంత కీలకమైన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ)ని పాలకపక్షం గాలికొదిలేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం గురించి పట్టించుకున్న వారు లేరు. గతంలో జరిగి ఏడు నెలలు దాటినా దాని ఊసే లేదు. జిల్లా పునర్విభజన అయి ఐదు మాసాలు పూర్తయినా ఇంతవరకూ ఉమ్మడిగా కానీ, విడివిడిగా కానీ డీఆర్సీ సమావేశం నిర్వహించాలన్న ఆలోచనే బాధ్యత గల నేతలు చేయలేదు. అసలు కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ఉన్నారో.. లేదో..? కూడా తెలియని పరిస్థితి. ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తుండగా ఇప్పటివరకు డీఆర్సీ సమావేశాలు మూడు మాత్రమే నిర్వహించడం పాలకపక్ష ఉదాసీనతను పట్టిచూపుతోంది.
ఒంగోలు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): పాలనా వ్యవస్థలో రాష్ట్రస్థాయిలో అసెంబ్లీ, శాసనమండలి వంటి చట్టసభల తర్వాత జిల్లాస్థాయిలో డీఆర్సీ అత్యంత కీలకమైంది. ప్రభుత్వం తరఫున పొరుగు జిల్లాలకు చెందిన మంత్రి ఈ కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తారు. జడ్పీ చైర్మన్ కమిటీ వైస్‌చైర్మన్‌గా.. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాస్థాయి సంస్థల చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి మూడు మాసాలకు ఒకసారి సమావేశమై జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించి లోటుపాట్లను సవరించి మరింత పారదర్శకంగా, వేగవంతంగా అవి అమలయ్యేలా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయాలి. అదేసమయంలో తక్షణ, దీర్ఘకాలిక ప్రజా సమస్యలపై చర్చించడం అవకాశం ఉన్న వాటిని స్థానికంగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. అవకాశం లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలి. అవసరమైతే మూడు మాసాల లోపే ఒక్కోసారి డీఆర్సీ సమావే శం నిర్వహించాల్సి వస్తుంది. మొత్తం ఈ ప్రక్రి యలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పాత్ర అత్యంత కీలకం.
మందగమనంగా ప్రక్రియ
జిల్లాలోని ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడం, అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయడం డీఆర్సీ లక్ష్యం. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు రాబట్టడం తద్వారా జిల్లా అభివృద్ధి, పురోగతిలో ఇన్‌చార్జి మంత్రి జోక్యం, చొరవ అవసరం. అయితే ప్రజా ప్రభుత్వం వచ్చాక ఈ మొత్తం ప్రక్రియ మందగమనమైంది. ఇన్‌చార్జి మంత్రిగా రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో ఒకరైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నియమితులయ్యారు. విశేష రాజకీయ, పాలనా అనుభవం, ఉమ్మడి ప్రకాశం జిల్లాపై సంపూర్ణ అవగాహన కలిగిన మంత్రి ఆనం ఇన్‌చార్జి మంత్రి కావడం ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రజా ప్రభుత్వం 2024 జూన్‌లో ఏర్పడగా అక్టోబరు నాటికి ఇన్‌చార్జి మంత్రుల నియామకాలు పూర్తయ్యాయి. అలా 20మాసాల క్రితం ఇన్‌చార్జి మంత్రుల నియామకం జరగ్గా ఇప్పటికి ఏడుసార్లు డీఆర్సీ సమావేశాలు జరగాలి. అయితే కేవలం మూడు సార్లు మాత్రమే నిర్వహించారు. ఇన్‌చార్జి మంత్రి నియామకం జరిగిన తొలినాళ్లలో 2024 నవంబరు తొలివారంలో ఒకసారి నిర్వహించగా 2025 మేలో రెండో సారి. అదే ఏడాది నవంబరు 5న మూడోసారి డీఆర్సీ జరిగింది.
పీ-4 కోసం ప్రత్యేక సమావేశం
పీ-4 కార్యక్రమంపై ప్రత్యేకంగా చర్చించేందుకు ఆస్థాయి సమావేశాన్ని ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాల్సి రాగా ఆ అంశంపై అది కూడా మార్కాపురం ప్రాంతంలో మరో కార్యక్రమానికి ముఖ్యనేతలంతా హాజరైన సందర్భంలో మొక్కుబడిగా మీటింగ్ పెట్టారు. అలా అధికారికంగా డీఆర్సీ సమావేశాలు మూడు మాత్రమే జరగ్గా గత సమావేశం నిర్వహించి ఏడు మాసాలు దాటింది. ఈలోపు జిల్లా పునర్విభజన కూడా జరిగిపోయింది. గత ఏడాది డిసెంబరు 31న పునర్విభజన జరిగి పశ్చిమప్రాంతంలోని నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. ప్రకాశంలోకి ఇటు కందుకూరు, అటు అద్దంకి వచ్చి చేరాయి. ఈ విభజన జరిగాక డీఆర్సీ సమావేశం ఒక్కసారి కూడా నిర్వహించలేదు. నూతనంగా ఏర్పడిన జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిపై స్పష్టత లేదు.
సమస్యలు చాలా.. పరిష్కారమెలా?
డీఆర్సీ స్థాయిలో చర్చించాల్సిన అనేక అంశాలు ప్రస్తుతం జిల్లాలో ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను పరిశీలిస్తే పారిశ్రామిక, ఉపాధి రంగాల అభివృద్ధిలో భాగంగా రామాయపట్నం పోర్టు.. దాని ఆధారంగా ఇతర కంపెనీలు ఆ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయి. దొనకొండ కారిడార్‌లో పరిశ్రమల ఏర్పాటు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో సీబీజీ ప్లాంట్లు, వాటికి ఎదురవుతున్న సమస్యలు, పురోగతి చర్యలు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే వెలిగొండ పూర్తి, ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీ నిర్మాణం, ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ, ఫార్మా హబ్ ఏర్పాటు, ఇతర హామీల అమలుపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. వీటన్నింటిలో ఒక్క వెలిగొండ మినహా మిగిలిన వాటిలో పురోగతి లేదు. వెలిగొండ విషయంలో జిల్లా నేతల పాత్ర అంతగా లేదన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వ పథకాల అమలును పరిశీలిస్తే ఏ ఒక్కటీ సజావుగా లేవు. జిల్లాలో సహకార రంగం సంక్షోభంలో ఉండి అన్ని స్థాయిల్లోని సంస్థలు విచారణలు ఎదుర్కొంటుండగా కీలకమైన జలజీవన్ మిషన్, రోడ్ల పనులు ముందుకు సాగడం లేదు.
అంతా అవినీతిమయం
ఉపాధి హామీ పథకం అవినీతిమయంగా మారగా పొదుపు మహిళలకు రుణాలు అందడం లేదు. విద్య, వైద్యం, సంక్షేమం, ఇరిగేషన్ ఇలా కీలక శాఖలన్నీ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇక జిల్లా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పొగాకు. శనగ, మొక్కజొన్న, కంది ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. కొద్దిపాటి ప్రభుత్వ ప్రోత్సహంతో కంది, శనగ కొనుగోలు చేసినప్పటికీ నామమాత్రంగానే ఊరట లభించింది. పొగాకు రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. మళ్లీ ఖరీఫ్ సీజన్ రాగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి పంటలకు ప్రతికూల వాతావరణం ఏర్పడనుండగా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు ఏమీ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తరుచూ డీఆర్సీ సమావేశాల నిర్వహణ లేదా కనీసం ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశమై ఆయా అంశాలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి ప్రయత్నం అటు ఇన్‌చార్జి మంత్రి వైపు నుంచి, ఇటు జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర కీలక ప్రజాప్రతినిధుల వైపు నుంచి కనిపించడం లేదు. జిల్లాకు ఆయన రారు, ఇక్కడ ఉన్నవారు పట్టించుకోరు అన్నట్లుగా నేతల తీరు కనిపిస్తోంది.