అంకితం కాదు.. అశయం నెరవేర్చేలా..!
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:41 AM
వెలిగొండ పూర్తికాకుండానే గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. ప్రజలను మోసగించింది. అనేక పనులను అసంపూర్తిగా వదిలేసింది. టన్నెళ్ల నుంచి రిజర్వాయర్‌కు నీరు చేరే ప్రధాన ఫీడర్ కాలువ పనుల్లో నిపుణుల కమిటీ సూచనలను పెడచెవిన పెట్టింది.
వెలిగొండపై ప్రజాప్రభుత్వం శ్రద్ధ
అసంపూర్తి నుంచి పరిపూర్ణత వైపు
నాటి తప్పిదాలను సరిచేస్తూ చకచకా పనులు
రూ.456 కోట్లతో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు రేపు సీఎం శంకుస్థాపన
ఈ ఏడాది నీరందించడమే లక్ష్యం
ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం చేసిన గత వైసీపీ ప్రభుత్వం
జగన్ మోసాన్ని గుర్తించిన ప్రజానీకం
ప్రస్తుతం పనుల్లో వేగాన్ని చూసి నమ్మకం
వెలిగొండ పూర్తికాకుండానే గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. ప్రజలను మోసగించింది. అనేక పనులను అసంపూర్తిగా వదిలేసింది. టన్నెళ్ల నుంచి రిజర్వాయర్‌కు నీరు చేరే ప్రధాన ఫీడర్ కాలువ పనుల్లో నిపుణుల కమిటీ సూచనలను పెడచెవిన పెట్టింది. ఫలితంగా భారీవర్షాలు, తుఫాన్లకు కాలువ పలుచోట్ల కోతకు గురైంది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం పెండింగ్ పనులను శరవేగంగా పూర్తిచేసి ఈ ఏడాది ప్రాజెక్టు ద్వారా నీరందించాలన్న సంకల్పంతో అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం సమీక్షలు చేస్తూ పనుల్లో వేగం పెంచారు. ఒకవైపు టన్నెల్-2 పనులను చకచకా చేయిస్తున్నారు. ఫీడర్ కాలువ పటిష్టత అవసరమని గుర్తించి లైనింగ్‌కు రూ.456 కోట్లతో టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఆ పనులకు బుధవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు పునరావాస చర్యల్లోనూ స్పీడు పెంచారు. ఈ పరిణామాలన్నీ వెలిగొండపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాయి.
మార్కాపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఇటు సాగు, అటు తాగునీటిని అందించాలన్న సంక ల్పంతో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే అయిపోయినట్లు గత వైసీపీ ప్రభుత్వం జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేసింది. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా ఉన్న రెండో టన్నెల్ లోపల లైనింగ్ ప్రారంభించింది. ప్రతిరోజూ దాదాపు 200 మంది కూలీలు ఈ పనులను చేస్తున్నారు. లోపల 11 కి.మీ వద్ద టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం) నిలిచిపోయి ఉంది. దాని తొలగింపు విషయం కోర్టు పరిధిలో ఉండటంతో మొదటి సొరంగం నుంచి రెండో సొరంగం లోపలికి దాదాపు 6 చోట్ల రంధ్రాలు వేసి పనులకు అవసరమైన సామగ్రిని తరలిస్తూ కష్టసాధ్యమైన పనులను పూర్తి చేసేందుకు కూలీలు శ్రమిస్తున్నారు.
18 నెలల్లోనే ఎంతో పురోగతి
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే పనుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. టన్నెల్-2లో దాదాపు 7 కి.మీ లైనింగ్ పనులు పెండింగ్‌లో ఉంటే అందులో 18 నెలల్లోనే 3.2 కి.మీ పూర్తి చేశారు. దాదాపు రూ.428 కోట్లను ఈ కొద్ది కాలంలో వెచ్చించారు. టన్నెల్ లోపల ప్రతిరోజూ కూలీలతో 16 మీటర్ల లైనింగ్ పనులు జరుగుతున్నాయి. మరో 360 మీటర్ల ఎర్త్ వర్క్ మిగిలి ఉంది. అది కూడా త్వరలో పూర్తికానుంది. ఇవికాకుండా పునరావాస కాలనీల్లోని 7 గ్రామాల్లో 630 కుటుంబాలకు రూ.80 కోట్ల పరిహారం కూడా మంజూరు చేశారు. ఇవి త్వరలోనే వారి ఖాతాల్లో జమ కాను న్నాయి. ఫీడర్ కాలువకు టెండర్లు ఖరా రైన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా పనులను ప్రారంభించారు. రోజుకు 1,000 క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. లైనింగ్ పనులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలా అటు టన్నె ల్, ఇటు కాలువ పనులు శరవేగంగా చేప ట్టి ఈ ఏడాది వెలిగొండ నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
గతంలో తూతూమంత్రగా ఫీడర్ కాలువ పనులు
గత వైసీపీ ప్రభుత్వం ఫీడర్ కాలువ పనులను తూతూమంత్రంగా చేసి దులుపుకుంది. దాదాపు 22 కి.మీ పొడవున కాలువ తవ్వి వదిలేయడం తప్ప చేసిందేమీ లేదు. వెలిగొండ నీటిని ఈ కాలువ ద్వారా రిజర్వాయర్‌లకు చేర్చాలి. అంటే నీరు వదిలినప్పుడు ఆ ప్రవాహానికి కాలువ కట్టలు తట్టుకునేలా దృఢంగా ఉండాలి. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఫలితంగా గతంలో వర్షాలు, తుఫాన్‌లు వచ్చినప్పుడు ఫీడర్ కాలువ పలుచోట్ల కోతకు గురై గండ్లు పడ్డాయి.
పటిష్టతకు ప్రజాప్రభుత్వం చర్యలు
ప్రజాప్రభుత్వం ఫీడర్ కాలువ లైనింగ్ పనులు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్లు మంజూరు చేసింది. ఆ వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ పనులకు సీఎం చంద్రబాబు బుధవారం శంకుస్థాసన చేయనున్నారు. ఇప్పటికే 5.6 కి.మీ పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రోజుకు 1,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తున్నారు. నిర్దేశించిన గడువు 6 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. రిటైనింగ్ వాల్ కోసం దాదాపు 20 అడుగుల లోతు పునాది నుంచి కాంక్రీట్ గోడను కడుతున్నారు. ఇవన్నీ చూసిన ప్రజలు పునాది స్థాయి నుంచి చేయాల్సిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉండగానే గత ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి మోసం చేసిందని గుర్తించారు. ప్రజా ప్రభుత్వం వెలిగొండను తప్పక పూర్తిచేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.