ఈశాన్యం... ఉపశమనం
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:08 AM
జిల్లాపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం కని పిస్తోంది. పలు ప్రాంతాల్లో జల్లులు పడుతుం డగా కొన్నిచోట్ల ఒక మోస్తరు వాన కురిసింది. జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
పలు ప్రాంతాల్లో వర్షం
కొన్నిచోట్ల ఒక మోస్తరు వాన
చల్లబడిన వాతావరణం
రబీ సాగుకు ఉపయుక్తం
ఒంగోలు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం కని పిస్తోంది. పలు ప్రాంతాల్లో జల్లులు పడుతుం డగా కొన్నిచోట్ల ఒక మోస్తరు వాన కురిసింది. జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అదేసమయంలో పంటల సాగుకు ఈ జల్లులు ఉపయుక్తం కానున్నాయి. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రజానీకం తల్లడిల్లిపోతోంది. పంటల సాగుకు వాతావరణం అనుకూలించక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు సుమారు 538.14 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 179 మి.మీ మాత్రమే కురిసింది. అలా దాదాపు 66.56శాతం లోటు ఉంది. ఖరీఫ్లో కీలకమైన జూలై, ఆగస్టుల్లో 80శాతానికిపైగా లోటు వర్షపాతంతో పంటల సాగు ముందుకు సాగలేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 55,774 హెక్టార్లు కాగా సెప్టెంబరు మూడో వారం వర కు 35శాతం విస్తీర్ణంలో కూడా పంటలు సాగు కాలేదు. ఆ సమయంలో మూడు, నాలుగు రోజులు ఒక మోస్తరు వానలు కురిశాయి. దీంతో ఖరీఫ్ సాగు కాస్తంత కదిలింది. అలా సాధారణ సాగు విస్తీర్ణంలో సుమారు 69శాతమే పంటలు వేయగలిగారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో సుమారు 39వేల హెక్టార్లలో వేసిన కంది, వరి, మొక్కజొన్న, సజ్జ, నువ్వు ఇతరత్రా పంటలు పొలాల్లో ఉన్నాయి. గత నెల మూడో వారంలో కురిసిన వర్షంతో రబీ సాగుకు దుక్కులను దున్ని పంట వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. దాదాపు నెలరోజు లుగా తిరిగి వర్షం లేక ఆందోళన చెందుతున్న తరుణంలో రెండురోజులుగా ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 9 గంటలకు 24 గంటల వ్యవధిలో జిల్లాలో రెండు సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది.