నేటి నుంచి నామినేషన్లు
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:32 AM
జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడత ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని 8 మండలాల్లోని 139 గ్రామపంచాయ తీలు, 1,396 వార్డులకు ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
క్లస్టర్ స్థాయిలో స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో తొలి దశ 8 మండలాల్లో 139 పంచాయతీలకు ఎన్నికలు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడత ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని 8 మండలాల్లోని 139 గ్రామపంచాయ తీలు, 1,396 వార్డులకు ఆదివారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మండల స్థాయిలో మూడు, నాలుగు పంచాయతీలకు ఒకచోట నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలోని జనాభా ప్రాతిపదికన పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
26న పోలింగ్, కౌంటింగ్
నామినేషన్లను ఆదివారం నుంచి ఈనెల 17వతేదీ వరకూ స్వీకరించనున్నారు. 18న పరిశీలన ఉంటుంది. 19న పరిశీలనలో తొలగించిన నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరిస్తారు. ఈనెల 21వతేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతోపాటు గుర్తులను కూడా ఎన్నికల అధికారులు ఇస్తారు. ఈనెల 26వతేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లు లెక్కిస్తారు.