మళ్లీ పెరుగుతున్న నోబిడ్‌లు
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:30 AM
దక్షిణాది పొగాకు మార్కెట్లో నోబిడ్‌లు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. సోమవారం మార్కెట్లో 33శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి. శనివారం నాటి కన్నా ఒక్కసారిగా ఏకంగా 10శాతం పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా 33శాతం పొగాకు బేళ్లు వెనక్కు
రెండు రోజుల్లో పదిశాతం పెరిగిన తిరస్కరణలు
ఒంగోలు-2లో అతఽ్యధికంగా 47.67శాతం నోబిడ్‌లు
పలుచోట్ల 35శాతంపైనే.. పొదిలిలో రోడ్డెక్కిన రైతులు
కందుకూరులో వేలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి
ఒంగోలు, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో నోబిడ్‌లు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. సోమవారం మార్కెట్లో 33శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి. శనివారం నాటి కన్నా ఒక్కసారిగా ఏకంగా 10శాతం పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈక్రమంలో ధరలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పొదిలిలో వేలాన్ని బహిష్కరించి రోడ్డెక్కారు. పక్షం క్రితం వరకు పలు కేంద్రాల్లో నోబిడ్‌లు భారీగా ఉండేవి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇది ప్రధానాంశంగా చర్చకు రాగా సగటు ధర కిలో రూ.200 తగ్గకుండా చూడటంతోపాటు నోబిడ్ అన్నది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదనుగుణంగా బోర్డు అధికారులు కూడా నోబిడ్‌ల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అటు వ్యాపారులు, ఇటు రైతులను సమన్వయం చేస్తూ క్రమంగా నోబిడ్‌లు 15 నుంచి 20శాతం లోపునకు తెచ్చారు. అయితే మళ్లీ వాటి సంఖ్య పెరుగుతోంది. ఈనెల 4న దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో సగటున సుమారు 23శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి. ఎస్‌బీఎస్ రీజియన్‌లో 25శాతం, ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో 21శాతం అయ్యాయి. సోమవారం ఏకంగా 33శాతానికి చేరాయి. అధిక కేంద్రాల్లో 35శాతం కన్నా ఎక్కువగా నోబిడ్‌లు సోమవారం కనిపించాయి.
మెరుగుపడని మార్కెట్
గరిష్ఠంగా ఒంగోలు-2 కేంద్రంలో 47.67శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి. అవి వెల్లంపల్లిలో 39.88శాతం, పొదిలిలో 39.47శాతం, ఒంగోలు-1లో 38.32శాతం, కనిగిరిలో 36.67శాతంగా ఉన్నాయి. అదేస మయంలో శనివారం నాటి కన్నా సోమవా రం సగటు ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం రెండు రీజియన్లలో కలిపి కిలో సగటు ధర రూ.189.15 లభించగా సోమ వారం మరో నాలుగు రూపాయలు పెరిగి కిలో రూ.192.35 లభించింది. అలా సగటు ధర పెరగడం కాస్తంత ఊరట కలిగిస్తున్నా నోబిడ్‌లు భారీగా ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో నిత్యం ఏదో ఒకచోట నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. మంత్రులు వేలం కేంద్రాలను సందర్శించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా మార్కెట్ మెరుగుపడకపోవడంతో నిరసనలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో సోమవారం పొదిలిలో రైతులు ఆందోళనకు దిగారు. అక్కడ వేలం కేంద్రానికి సుమారు 400 బేళ్లు కొనుగోలు జరిగే సరికి 15 నోబిడ్ అయ్యాయి. దీంతో వేలంను అడ్డుకొన్న రైతులు అనంతరం రోడ్డెక్కి రాస్తారోకోకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని విరమింపజేశారు. అదేసమయంలో కందుకూరు వేలం కేంద్రాన్ని అక్కడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సందర్శించి రైతులకు ఊరట కలిగేలా చూడాలని బయ్యర్లు, అధికారులను కోరారు. అయితే ఆ వేలం కేంద్రంలోనూ సోమవారం 22.52శాతం బేళ్లు నోబిడ్ కాగా సగటు ధర రూ.190 మాత్రమే లభించింది.