Share News

నోబిడ్‌.. ఏం చేద్దాం?

ABN , Publish Date - Jul 08 , 2026 | 01:49 AM

పొగాకు మార్కెట్‌ మళ్లీ సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. మూడు రోజులుగా నోబిడ్‌లు పెరుగుతున్నాయి. మంగళ వారం మార్కెట్‌ మరింత పతనమైంది. గత వారం వరకు ధరల మాట ఎలా ఉన్నా నోబిడ్‌లు తగ్గాయి. అయితే సోమ వారం నుంచి తిరిగి మార్కెట్‌లో ధరలు సరిలేకపోవడమే కాక మళ్లీ నోబిడ్‌లు పెరగడం ప్రారంభమైంది.

నోబిడ్‌.. ఏం చేద్దాం?
పొగాకు మార్కెట్‌పై చర్చిస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు, రవికుమార్‌, డాక్టర్‌ స్వామి, అనగాని

పొగాకు మార్కెట్‌ మరింత పతనం

భారీగా పెరుగుతున్న తిరస్కరణలు

ఒంగోలు-1 కేంద్రంలో ఏకంగా 55.88శాతం

పొదిలి, క లిగిరిలోనూ 50శాతంపైనే!

పొదిలిలో రైతుల నిరసనల మధ్య సాగిన వేలం

కందుకూరులో కొనుగోళ్లను పరిశీలించిన బోర్డు చైర్మన్‌

తాజా పరిస్థితిపై మంగళగిరిలో మంత్రుల భేటీ

ఒంగోలు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌ మళ్లీ సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. మూడు రోజులుగా నోబిడ్‌లు పెరుగుతున్నాయి. మంగళ వారం మార్కెట్‌ మరింత పతనమైంది. గత వారం వరకు ధరల మాట ఎలా ఉన్నా నోబిడ్‌లు తగ్గాయి. అయితే సోమ వారం నుంచి తిరిగి మార్కెట్‌లో ధరలు సరిలేకపోవడమే కాక మళ్లీ నోబిడ్‌లు పెరగడం ప్రారంభమైంది. దీంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. అటు బోర్డు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి. దీంతో మార్కెట్‌ను ఎలా గాడిలో పెట్టాలన్న దానిపై మంగళవారం అమరావతిలో మంత్రులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏమైనా చర్యలు చేపడతారేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పొగాకు మార్కెట్‌లో రానురాను నోబిడ్‌ బేళ్లు పెరుగుతుండగా ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు దిగుతున్నారు. వ్యాపారులు లోగ్రేడ్‌లో మెరుగైనదిగా పిలిచే బ్రౌన్‌ రకం పొగాకును కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే మేలు రకం గ్రేడ్‌లలో కూడా మంచి నాణ్యత ఉన్నది అయితేనే కొంటున్నారు. రైతులు మాత్రం చాలాచోట్ల సెలైన్‌ రకం (తెల పర) పొగాకు బేళ్లను ఎక్కువగా తెస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లో మొంథా తుఫాన్‌ అనంతరం వర్షాలు లేక ఎక్కువ ప్రాంతాల్లో ఒకటికి రెండు, మూడుసార్లు పొగతోట లకు నీరు పెట్టారు. దాని వల్ల సెలైన్‌ టైప్‌ ఆకు అధికంగా వచ్చింది. దానిని ప్రస్తుతం రైతులు మార్కెట్‌కు తెస్తుండగా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. అలాంటి బేళ్లకు కిలో రూ.160 ధరను బోర్డు అధికారులు ఆఫర్‌ చేస్తున్నా కొనేందుకు బయ్యర్లు ఏమాత్రం ఆసక్తిచూపడం లేదు. దీంతో పలు కేంద్రాల్లో భారీగా బేళ్లు నోబిడ్‌ అవుతు న్నాయి. అలా శనివారం దక్షిణాదిలోని 11 కేంద్రాల్లో వేలానికి తెచ్చిన బేళ్లలో 23శాతం నోబిడ్‌ అయ్యాయి. సోమవారం అవి 33శాతంగా ఉన్నాయి.

సగానికిపైగా వెనక్కి..

నోబిడ్‌ బేళ్లు మంగళవారం మరింత పెరిగి 37శాతం వరకు ఉన్నాయి. పలు కేంద్రాల్లో వేలంకు తెచ్చిన బేళ్లలో సగానికిపైగా ఇలా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. గరిష్ఠంగా ఒంగో లు-1 కేంద్రంలో ఏకంగా 55.88శాతం బేళ్లు తిరస్కణకు గురయ్యాయి. అక్కడ వేలంకు 655 బేళ్లు రాగా కేవలం 254 మాత్రమే బయ్యర్లు కొనుగోలు చేశారు. మిగిలిన వాటిలో 366 బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. మరో 35 బేళ్లు వివిధ కారణాలతో తిరస్క రణకు గురయ్యాయి. నెల్లూరు జిల్లా కలిగిరిలో 50.31శాతం, మార్కా పురం జిల్లా పొదిలిలో 50.24శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. అవి వెల్లంపల్లిలో 48.06శాతం, కనిగిరిలో 47.31శాతం ఉన్నాయి. ఒక్క కందు కూరు-2 మినహా ఇతర అన్నిచోట్ల 25శాతం కన్నా ఎక్కువగానే నోబిడ్‌ అయ్యాయి. పొదిలిలో సోమవారం రైతులు వేలా న్ని నిలిపి వేసి రోడ్డెక్కి ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం బోర్డు అధికారులు, రైతులు, బయ్యర్లతో చర్చించి వేలం నిర్వహిం చారు. అక్కడ వేలం జరిగినంతసేపు రైతులు తీవ్ర నిరసనలతో గందరగో ళంగా సాగింది. చివరకు 50శాతానికి పైగా బేళ్లు నోబిడ్‌ కాగా మిగిలిన వాటిని కొనుగోలు చేసి మమ అనిపించారు.

వ్యవసాయశాఖ మంత్రితో భేటీ

పొగాకు మార్కెట్‌పై అమరావతిలో కీలక మంత్రులు భేటీ అయ్యారు. జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌లు ఇటీవల జిల్లాలోని వేలం కేంద్రాలను సందర్శించి కొనుగోళ్ల తీరును పరిశీలించిన విషయం విదితమే. ఆ సందర్భంగా తాము గమనించిన అంశాలను వారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ఈ అంశంపై భేటీ జరిగింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతోపాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కూడా పాల్గొన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం సగటు ధర కిలో రూ.200 లభించేలా చేయడం, నోబిడ్‌లు లేకుండా చూడటంపై వారు చర్చించినట్లు సమాచారం. మరోవైపు పొగాకు బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌ మంగళవారం కందుకూరు-2 వేలం కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి కొనుగోళ్ల తీరును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం రైతుల తరఫున పలు అంశాలను బోర్డు చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లి మెరుగైన ధరలు లభించేలా చూడాలని కోరారు.

నేడు సీఎం సమీక్ష

రాష్ట్రంలో పొగాకు మార్కెట్‌ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆ విషయంపై దృష్టిసారిం చారు. అందులోభాగంగా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రెండు మాసాలుగా ధరలు లేక, కొను గోళ్లు సాగక పొగాకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ నిర సనలకు దిగిన విషయం విదితమే. ఈనేపథ్యంలో స్పందించిన సీఎం గతనెల 18న పొగాకు పండే ప్రాంతాలలో ప్రజాప్రతిని ధులు, రైతు నాయకులు, బోర్డు అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. కిలో సగటు ధర రూ.200కు తగ్గకుండా అలాగే నోబిడ్‌ అనేది లేకుండా చర్యలు తీసుకోవాలని బోర్డు అధికారులను, వ్యాపారులను ఆదేశించారు. అయితే ఆచరణలో పెద్దగా మార్పు కనిపించలేదు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు కోరుతూ మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఇతర ఎమ్మెల్యేలు వేలం కేంద్రాలకు వెళ్లి కొనుగోళ్లను పరిశీలించారు. స్థానిక బోర్డు అధికారులు, కంపెనీల ప్రతినిధులకు సూచనలను చేశారు. అయినా ఆశించిన మార్కెట్‌ రాకపోగా, నాలుగు రోజులు నుంచి మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. దీనిపై మంగళవారం అమరావతిలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో మత్రులు స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్‌ భేటీ అయి చర్చించారు. మార్కెట్‌ పరిస్థితి తీవ్రతను గుర్తించిన వారు విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన ఆయన మరోసారి ఉన్నత స్థాయి సమీక్షకు నిర్ణయించారు. ఆ ప్రకారం బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ఈ సమీక్ష జరగనుంది. బోర్డు అధికారులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులును ఆ సమీక్షకు రావాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. అలాగే జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర కీలక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

Updated Date - Jul 08 , 2026 | 01:49 AM