‘ఉపాధి’ లేక ఉసూరు
ABN , Publish Date - May 13 , 2026 | 03:15 AM
మండ లంలో రెండు వారాలుగా ఉపాధి పనులు లేకపోవడంతో కూలీలు ఉసూరుమంటున్నారు. వేసవికాలం కావడంతో గ్రామాల్లో రోజువారీ పొలం, వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధి పనికి వెళ్తున్నారు. వారు చేసిన పనిని బట్టి రోజుకు సుమారు రూ.250 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది.
సకాలంలో పనుల కల్పనలో అధికారులు విఫలం
9 పంచాయతీల్లో నిలిచిన వైనం
రూ.6 కోట్ల పనులు అనుమతి కోసం ఎదురుచూపులు
భువన్ యాప్‌లో కనిపించని వివరాలు
ఉలవపాడు, మే 11 (ఆంధ్రజ్యోతి) : మండ లంలో రెండు వారాలుగా ఉపాధి పనులు లేకపోవడంతో కూలీలు ఉసూరుమంటున్నారు. వేసవికాలం కావడంతో గ్రామాల్లో రోజువారీ పొలం, వ్యవసాయ పనులు లేక కూలీలు ఉపాధి పనికి వెళ్తున్నారు. వారు చేసిన పనిని బట్టి రోజుకు సుమారు రూ.250 వరకు కూలి గిట్టుబాటు అవుతోంది. వీరికి కేటాయించిన పనుల ఐడీల కోసం కొత్తగా కేంద్ర ప్రభుత్వం భువన్ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతోపాటు గ్రామాల్లో అంచనా వేసిన ఉపాధి పనులకు అనుమతులు ఆలస్యం కావడంతో వాటిని చేపట్టేందుకు వీలులేకుండా పోయింది. రెండు వారాలుగా మండలంలోని తొమ్మిది పంచా యతీల్లో ఉపాధి పనులు నిలిచిపోయాయి. 2006-27 సంవత్సరానికి సంబంధించిన పనుల గుర్తింపునకు అధికారులు ఫిబ్రవరిలోనే గ్రామ సభలు నిర్వహించారు. టీఏ, ఈసీ, ఏపీవో ఉపాధి హామీ అధికారులు అందరు కలిసి అంచనాలు తయారు చేశారు. వర్క్ ఐడీలు, పనుల అప్రూవల్ కోసం డ్వామా పీడీ కార్యాలయానికి పంపించారు. కానీ ఇప్పటికి భువన్ యాప్‌లో మండలంలోని ఏ ఒక్క పంచాయతీకి సంబంధించిన ఉపాధి పనుల వివరాలు ఇన్‌స్టాల్ కాలేదు. ఉపాధి పనులు చేసే ప్రాంతంలో భువన్ యాప్‌లో ఆ పనికి సంబంధించిన వర్క్ ఐడీ డిస్‌ప్లే అయితేనే ఐరిస్ ద్వారా కూలీల మస్టర్లు తీసుకొని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది సుమారు నెలరోజులుగా కొత్త పనులకు సంబంధించిన వర్క్ ఐడీలు అప్రూవల్ కాకపోవడంతో మండలంలో ఉపాధి పనులు నిలిచిపోయాయి.
అధారుల నిర్లక్ష్యంపై కూలీల అసంతృప్తి
ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉపాధి పనులు మందకొడిగా సాగుతున్నాయని కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ప్రాంతాలను బట్టి పనులు చూపించి మిగిలిన వారికి పనులు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వేసవిలో ఎలాంటి కూలి పనులు ఉండవని ఉపాధి పనులతో రోజుకి రూ.250 వరకు కూలి గిట్టుబాటు అవుతుందని అనుకుంటే అదికూడా లేకుండా చేశారని కూలీలు ఆవేదన వెళ్లగక్కుతున్నారు.