Share News

మొక్కజొన్న రైతుకు ‘మద్దతు’ ఏదీ

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:10 AM

ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసిన వారు ఇప్పుడు దాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రోజురోజుకూ ధర దిగజార్చి కొనుగోలు చేస్తున్నారు. కొన్నిచోట్ల అసలు కొనేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం క్వింటా రూ.1,700కు మించి కొనడం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈనేపథ్యంలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వాల నిర్ణయాలు ఆలస్యమైతే మొక్కజొన్న రైతులు నిండా మునిగిపోయే ప్రమాదముంది.

మొక్కజొన్న రైతుకు   ‘మద్దతు’ ఏదీ
కల్లాల్లోకి చేరుస్తున్న మొక్కజొన్న కండెలు

ఉమ్మడి జిల్లాలో భారీగా సాగు

పెరిగిన దిగుబడి.. దిగజారిన ధర

మొదట్లో క్వింటా రూ.3,500కు

కొనేలే కంపెనీల ఒప్పందం

ఇప్పుడు ముఖం చాటేస్తున్న వైనం

ఆందోళనలో సాగుదారులు

ఆదుకోవాలని ఇప్పటికే కేంద్రానికి

లేఖ రాసిన సీఎం చంద్రబాబు

నిర్ణయంలో జాప్యమైతే

రైతులు నిండా మునిగే ప్రమాదం

ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేసిన వారు ఇప్పుడు దాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రోజురోజుకూ ధర దిగజార్చి కొనుగోలు చేస్తున్నారు. కొన్నిచోట్ల అసలు కొనేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం క్వింటా రూ.1,700కు మించి కొనడం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈనేపథ్యంలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ కూడా రాశారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వాల నిర్ణయాలు ఆలస్యమైతే మొక్కజొన్న రైతులు నిండా మునిగిపోయే ప్రమాదముంది.

మార్కాపురం టౌన్‌/అద్దంకి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో రెండేళ్లుగా మిర్చి, పొగాకు పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. దీంతో వారు ఎక్కువగా మొక్కజొన్న వైపు మొగ్గుచూపారు. మార్కాపురం ప్రాంతంలో కంపెనీలే విత్తనాలు ఇవ్వడం, కొంతమేర పెట్టుబడి సాయం చేయడం కూడా సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడింది. 2025-26 ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో కలిపి జిల్లాలో వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం 26 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైనట్లు చెబుతున్నారు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సుమారు లక్ష ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగుచేసినట్లు తెలుస్తోంది. ఎక్కువగా అర్ధవీడు, బేస్తవారపేట, తర్లుపాడు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, కంభం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో సాగైంది. మిగిలిన మండలాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో వేశారు.

పతనమైన ధరలు ఽ

గతంతో పోల్చితే మొక్కజొన్న దిగుబగులు ఆశాజనకంగా ఉన్నాయి. సరాసరిన ఎకరాకు 30 క్వింటాళ్ల మేర వచ్చింది. కొన్ని గ్రామాల్లో ఎకరాకు 50 క్వింటాళ్లు లభించింది. మార్కాపురం ప్రాంతంలో కంపెనీల ప్రతినిధులు రైతులకు విత్తనాలు ఇచ్చేటప్పుడే ధరపై కూడా ఒప్పందం చేసుకున్నారు. క్వింటా రూ.3,500గా నిర్ణయించారు. అంతేకాక రైతులకు పెట్టుబడి ఖర్చుల కింద ఎకరాకు రూ.10 వేల చొప్పున కూడా సమకూర్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ధరలు దిగజారాయి. ఒకవైపు అధిక దిగుబడులు, మరోవైపు ధరలు తగ్గడంతో కంపెనీల ప్రతినిధులు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మార్కాపురం ప్రాంతంలో రైతులకు ఇచ్చిన విత్తనాలు, పెట్టుబడి పోయినా ఫర్వాలేదు కానీ కొంటే అంతకంటే ఎక్కువ మునుగుతామని భయపడి ముఖం చాటేశారు. దీంతో రైతులు పండిన ఉత్పత్తులను ఏం చేసుకోవాలో పాలుపోక దీనావస్థలో ఉన్నారు.

సాగర్‌ ఆయకట్టులోనూ అదే పరిస్థితి

వరికి గత ఏడాది కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో సాగర్‌ ఆయకట్టు పరిధిలోని రైతులు కూడా మొక్కజొన్న సాగు చేపట్టారు. దీంతో అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిదిలో ఈ పంట సాగు రెట్టింపు అయ్యింది. నీరు సమృద్ధిగా ఉండటంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది దిగుబడులు 30 నుంచి 35 క్వింటాళ్ల మధ్యలో ఉండగా, ఈ ఏడాది సరాసరిన 40 క్వింటాళ్లు వస్తున్నాయి. ధరలు మాత్రం దిగజారాయి. మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధరను క్వింటాకు రూ.2,400 ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రోజురోజుకూ ధర దిగజార్చి కొంటున్నారు. కొన్నిచోట్ల అసలు కొనుగోలు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం క్వింటా రూ.1,700కు మించి కొనడం లేదు. దీంతో ఎకరాకు సరాసరిన రూ.25 వేలు నష్టపోయే పరిస్థితి నెలకొంది.


రైతుల్లో ఆందోళన

వ్యవసాయ శాఖ అధికారుల గణాంకాల మేరకు పాత బాపట్ల జిల్లాలో సుమారు 47 వేల హెక్టార్లు, పాత ప్రకాశం జిల్లాలో 30 వేల హెక్టార్‌లలో మొక్కజొన్న సాగు చేశారు. అద్దంకి నియోజకవర్గంలో సుమారు 15 వేల హెక్టార్లు, దర్శి నియోజకవర్గంలో సుమారు 7వేల హెక్టార్లలో వేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక, వ్యాపారులు ధరలు మరింత తగ్గించటంతోపాటు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీనికితోడు వ్యాపారులను నమ్మి మొక్కజొన్నలను అమ్మితే డబ్బులు ఎప్పుడు ఇస్తారోనన్న భయం కూడా రైతులను వెంటాడుతోంది. మొక్కజొన్న కొనుగోళ్లకు అనుమతులు కోరుతూ సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:10 AM