నో స్టాక్
ABN , Publish Date - Apr 26 , 2026 | 02:41 AM
ఉమ్మడి జిల్లాలో డీజిల్‌కు కొరత ఏర్పడింది. యుద్ధప్రభావం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు డీజిల్‌పై పలురకాల ఆంక్షలు విధించినట్లు సమాచారం. నిన్నమొన్నటివరకు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసిన కంపెనీలు ఇప్పుడు తగ్గించినట్లు తెలిసింది.
ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరత
డిమాండ్‌కు అనుగుణంగా లేని సరఫరా
పెట్రోలు బంకుల వద్ద వాహనాల బారులు
మున్ముందు పరిస్థితిపై ఆందోళన
నిలిచిపోయిన గ్రానైట్ లారీలు
పరిశ్రమల్లోనూ మందగించిన పనులు
వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి జిల్లాలో డీజిల్‌కు కొరత ఏర్పడింది. యుద్ధప్రభావం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు డీజిల్‌పై పలురకాల ఆంక్షలు విధించినట్లు సమాచారం. నిన్నమొన్నటివరకు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసిన కంపెనీలు ఇప్పుడు తగ్గించినట్లు తెలిసింది. దీంతో కొద్దిరోజుల నుంచి అనేక బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్రానైట్ పరిశ్రమలు అధికంగా ఉన్న బల్లికురవ మండలంలోని బంకులలో రెండు రోజుల నుంచి అమ్మకాలు నిలిచిపోయాయి. గ్రానైట్ ముడిరాయిని రవాణా చేసే లారీలు పూర్తిగా ఆగిపోయాయి. క్వారీలలో పనులు కూడా నిలిచిపోతున్నాయి. వివిధ ఇతర రంగాలపైనా డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. పెట్రోల్ సమస్య కూడా ఉత్పన్నమవుతుందని ప్రచారం జరుగుతుండటంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు.
ఒంగోలు కలెక్టరేట్/బల్లికురవ/మార్కాపురం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం ప్రస్తుతం డీజిల్‌పై పడింది. బంకుల్లో నిల్వలు నిండుకుంటు న్నాయి. ఇదేసమయంలో ఆయిల్ కంపెనీలు జిల్లాకు డీజిల్ సరఫరాను తగ్గించాయి. దీంతో పెట్రోలు బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. బంకుల యజమానులు రెండు రోజులు ముందుగానే డీజిల్ కోసం డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్ సరఫరా చేస్తుం డటం కూడా సమస్యకు కారణమైంది. యుద్ధం వలన అంతర్జాతీయంగా క్రూడాయుల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఆయిల్ కంపెనీలు రేషన్ పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే డీజిల్ కొరత కారణంగా బల్లికురవ, దొనకొండ వంటి ప్రాంతాల్లో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గ్రానైట్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
డీజిల్ కొరత గ్రానైట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బల్లికురవ మండలంలో ఉన్న అన్ని బంకులలో రెండు రోజుల నుంచి అమ్మకాలు నిలిచిపోయాయి. తమకు డీజిల్ సరఫరా కావడం లేదని బంకుల యజ మానులు చెప్తున్నారు. దీంతో గ్రానైట్ పరిశ్రమలు అధికంగా ఉన్న బల్లికురవ మండలంలో ముడిరాయిని రవాణా చేసే లారీలు పూర్తిగా నిలిచిపోయాయి. లారీల యజమానులు డీజిల్ కోసం పలుప్రాంతాలకు వెళ్లి అక్కడా లేదని చెప్పటంతో తిరిగి వస్తున్నారు. వేమవరం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న బంకులో గత నాలుగు రోజుల నుంచి డీజిల్ అందుబాటు లో లేదు. దీంతో గ్రానైట్ పరిశ్రమలలో పనులు కూడా మందగించాయి. క్వారీల్లోనూ పనులు నిలిచిపోతున్నాయి. పరిశ్రమలకు తోడు వ్యవసాయ రంగంపైనా డీజిల్ ప్రభావం పడుతోంది. వేసవిలో కొందరు రైతులు బావు లపై డీజిల్ ఇంజన్లు ఏర్పాటుచేసుకొని పంటలు సాగుచేస్తున్నారు. ఎక్కడా డీజిల్ లేకపోవడంతో క్యాన్లను తీసుకొని బంకుల చుట్టూ తిరుగుతున్నారు. పెట్రోల్ కూడా పలు బంకులలో పూర్తిస్థాయిలో లేదు. అత్యవసరం పనిపై ఎక్కడికైన వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలులోని కొన్ని బంకుల్లో పెట్రోలు లభిస్తుండగా డీజిల్ స్టాక్ లేదని చెప్తున్నారు. వెంటనే డీజిల్ సరఫరా కాకపోతే పలు పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.
బంకుల వద్ద వాహనాల బారులు
మార్కాపురం జిల్లా అంతటా పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు భారీఎత్తున బారులు తీరుతున్నారు. నిల్వలు అయిపోతాయని, ధరలు పెరుగుతాయన్న భయంతో ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. పెట్రోల్ వరకు కొంతమేర బంకుల్లో లభిస్తున్నప్పటికీ డీజిల్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో ఇంధన కొరత ఏర్పడిందని సోషల్ మీడియాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో అవసరం ఉన్నా లేకున్నా వాహనదారులు పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంకులు చేయిస్తున్నారు.
పరిమితంగా అమ్ముతున్న నిర్వాహకులు
మార్కాపురం పట్టణంతోపాటు చుట్టుపక్కల సుమారు 13 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా స్థానిక తర్లుపాడు రోడ్డులోని ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న బంకులో సాధారణ సమయాల్లో కూడా కొంత రద్దీ ఉంటుంది. కానీ రెండు రోజులుగా నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయని చెబుతున్నారు. పెట్రోల్ నిల్వలు ఉన్నా రెండు లీటర్లకు మించి కొట్టడం లేదు. కాలేజీ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ సమీపం, ఎస్టేట్‌ల వద్ద ఉన్న బంకుల్లో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కంభం రోడ్డులోని రెండు బంకుల్లో పూర్తిగా నిల్వలు అయిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తాము ఇండెంట్ పెట్టినా తగినంత మేరకు నిల్వలు పంపడం లేదని చెబుతున్నారు. ఈ విషయమై మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ ఇంధన కొరత లేదన్నారు. రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి సద్దుమణుగుతుందని చెప్పారు.