విద్యాశాఖలో పడని విభజన అడుగులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:37 AM
ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో ఇంకా విభజన అడుగులు పడలేదు. ఫలితంగా కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు అధికారులు, సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి.
వెలవెలబోతున్న మార్కాపురంలోని జిల్లా కార్యాలయాలు
ఒకరిద్దరు తాత్కాలిక సిబ్బందే దిక్కు
ఉద్యోగులను వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నించని అధికారులు
ఒంగోలు విద్య, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో ఇంకా విభజన అడుగులు పడలేదు. ఫలితంగా కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు అధికారులు, సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. మార్కాపురం డీఈవో, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి కార్యాలయాల్లో ఒకరిద్దరు తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్నాయి. ఇతర ప్రభుత్వ శాఖల ఆఫీసులు మాత్రం ఉద్యోగులతో కళకళలాడుతు న్నాయి. మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని అక్కడి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తుండగా కొత్తగా మార్కాపురం డీఈవో కార్యాలయం, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి కార్యాలయాలు పట్టణ సమీపంలోని దరిమడుగు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేశారు. డీఈవోగా సీవీ.రేణుక, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారిగా అనిల్‌కుమార్‌లు ఇన్‌చార్జులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యాలయాలు ప్రారంభించి 25 రోజులు అయినా ఇప్పటివరకు ఒక్క రెగ్యులర్ సిబ్బందిని కూడా నియమించలేదు. ఇతర ప్రభుత్వ శాఖలు మార్కాపురం జిల్లాకు సంబంధించి రికార్డులను అక్కడికి తరలించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తుండగా జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షలో ఆ స్పందనే లేదు.
గత విభజన సమయంలో పక్క జిల్లాలకు..
గతంలో జిల్లాల విభజన జరిగినపుడు ఉమ్మడి ప్రకాశం జల్లా నుంచి కందుకూరును నెల్లూరులో.. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలను బాపట్ల జిల్లాకు కేటాయించారు. అప్పుడు డీఈవో కార్యాలయం నుంచి ఇద్దరు సూపరింటెండెంట్లను, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లను, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను, ఒక ఖాళీ టైపిస్టు, ఒక ఆఫీసు సబార్డినేట్‌ను కేటాయించారు. నెల్లూరు జిల్లాకు ఒక సూపరింటెండెంట్, ముగ్గురు సీనియర్, ఒక జూనియర్ అసిస్టెంట్లను, ఒక ఆఫీసు సబార్డినేట్‌ను కేటాయించారు. వీరికి కొత్త జిల్లాల కార్యాలయాలు ప్రారంభానికి ముందురోజు రాత్రి నియామక ఉత్తర్వులు జారీ అయ్యారు. కొత్త కార్యాలయాల ప్రారంభం రోజే వీరందరూ చేరిపోయారు. దీంతో జిల్లా కార్యాలయాలకు నిండుదనం వచ్చింది. ప్రజా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మార్కాపురం జిల్లా ఏర్పాటుపై దృష్టిపెట్టింది.
ఆ సిబ్బంది వస్తేనే...
మార్కాపురం, కనిగిరి, వైపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో జనవరి 1 నుంచి మార్కా పురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలోని కందుకూరు బాప ట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాలను తిరిగి ప్రకాశంలో చేర్చారు. జనవరి 1న జిల్లా కార్యాలయాలు ప్రారంభించారే కానీ సిబ్బందిని మాత్రం ఇవ్వలేదు. గతంలో కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసినప్పుడు ఆ జిల్లాకు వెళ్లిన సిబ్బంది, బాపట్ల జిల్లాకు కేటాయించిన సిబ్బందిలో మూడో వంతు మంది మళ్లీ తిరిగి ప్రకాశంకు రావాల్సి ఉంది. అయితే గత 25 రోజులుగా సిబ్బందిని బాపట్ల నెల్లూరు జిల్లాల నుంచి వెనక్కు తెచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధి కారులు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. మార్కాపురం కొత్త జిల్లాను సిబ్బంది కేటాయిం చలేదు. అయితే ప్రస్తుతం మార్కాపురం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం మూతపడకుండా హైస్కూలు నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక అటెండరు, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయానికి హైస్కూలు నుంచి ఒక జూనియరు అసిస్టెంట్, అటెండరు ఉన్నారు. వీరు ఆయా కార్యాలయాలకు వచ్చే తపాలా తీసుకొని జిల్లా కార్యాలయాలకు పంపుతున్నారు.