చలో కలెక్టరేట్‌కు అనుమతి లేదు
ABN , Publish Date - Oct 11 , 2026 | 02:39 AM
ఒంగోలులోని ప్రకాశం భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ అమలుకు ఆర్డీవోకు లేఖ
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడి
ఒంగోలు క్రైం, అక్టోబరు 10 (ఆంధ్ర జ్యోతి) : ఒంగోలులోని ప్రకాశం భవన్ ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ నాయ కులు అనుమతుల కోసం ఇచ్చిన లేఖలో పేర్కొన్న అంశాలకు, బయట ప్రచారం చేస్తున్న దానికి పొంతన లేదన్నారు. ఎక్కువసంఖ్యలో ప్రజలను సమీకరించే పనిలో ఉన్నట్లు నాయకులు పిలుపునిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఒంగోలులో 30 పోలీసు చట్టం అమలులో ఉందని తెలిపారు. అదేవిధంగా సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు కోసం ఆర్డీవోకు లేఖ రాశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఈ మేరకు ప్రజలు గమనించి ధర్నాలో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. సింగరాయకొండలో జరిగిన తౌషిక్ ఆత్మహత్యపై పోలీసు శాఖ ప్రత్యేక దర్యాప్తు చేపట్టిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నాయన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ కేసుకు సంబంధించిన అనుమానాలు నివృతి చేసుకోవాలనుకుంటే కలెక్టర్, ఎస్పీ లేదా డీఎస్పీతో మాట్లాడి సమాచారం తెలుసుకోవాలని కోరారు. ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు సమావేశంలో డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, సీఐలు వెంకటేశ్వరరావు, శేషగిరిరావు, హజరత్తయ్యలు పాల్గొన్నారు.