Share News

ఈకేవైసీ లేకుంటే అన్నీ కట్‌!

ABN , Publish Date - Jun 12 , 2026 | 02:54 AM

పథకాలన్నింటికీ వ్యక్తి యొక్క గుర్తింపు వివరాల నమోదు (ఈకేవైసీ)ను ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఇప్పటికే రేషన్‌ కార్డుదారులు, గ్యాస్‌ వినియోగదారులకు ఈ ప్రక్రియను ప్రారంభించింది. కార్డుదారులకు నెలాఖరు వరకూ గడువు విధించింది.

ఈకేవైసీ లేకుంటే అన్నీ కట్‌!

కార్డుదారులకు రేషన్‌ రాదు

గ్యాస్‌ కూడా నిలిపివేత

ఈ-క్రాప్‌ చేయించుకుంటేనే రైతులకు ఎరువులు

అన్నింటికీ నెలాఖరు వరకూ గడువు

మార్కాపురం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : పథకాలన్నింటికీ వ్యక్తి యొక్క గుర్తింపు వివరాల నమోదు (ఈకేవైసీ)ను ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఇప్పటికే రేషన్‌ కార్డుదారులు, గ్యాస్‌ వినియోగదారులకు ఈ ప్రక్రియను ప్రారంభించింది. కార్డుదారులకు నెలాఖరు వరకూ గడువు విధించింది. ఆ తర్వాత కార్డులో సభ్యుడిగా ఉండి ఈకేవైసీ చేయించుకోని వారికి రేషన్‌ సరుకులను నిలిపివేయనుంది. తాజాగా గ్యాస్‌కు సంబంధించి కూడా ఈకేవైసీ కానివారందరికీ సరఫరా నిలిపివేయాలని కంపెనీలు నిర్ణయించాయి. ఇక ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువుల కోసం ఇటీవల ఒక యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రైతులవారీ వివరాలు యాప్‌లో రిజిస్టర్‌ కాకున్నా, ఈక్రాప్‌ చేయకపోయినా వారికి ఎరువులు అందవు. అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

ఈకేవైసీ చేయించుకోని 30,830 మంది కార్డుదారులు

మార్కాపురం జిల్లాలో ఉన్న రేషన్‌ కార్డులన్నింటిలో 10,24,574 మంది సభ్యులు ఉంటే వారిలో ఇప్పటివరకు 9,59,663 మంది మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారు. మిగిలిన వారిలో ఐదేళ్లలోపు పిల్లలు 34,081 మంది పోను ఇంకా 30,830 మంది ఈకేవైసీ చేయించుకోలేదు. నెలల తరబడి అవకాశం ఇచ్చినా వారు రావడం లేదని డీలర్లు చెప్తున్నారు. అసలు వీరంతా ఉన్నారా? మృతులు, వలసదారులు, బోగస్‌ పేర్లతో ఇప్పటివరకు చెలామణి అవుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో 4,585 మంది, కనిగిరి నియోజకవర్గంలో 7,951 మంది, మార్కాపురం నియోజకవర్గంలో 4,144, ఎర్రగొండపాలెంలో 8,910 మందికి ఇంకా ఈకేవైసీ కాలేదు. వీరందరికీ వచ్చే నెల నుంచి రేషన్‌ నిలుపుదల చేయనున్నారు.

ఈకేవైసీ కాకుంటే ఇక గ్యాస్‌ నిలుపుదల

గ్యాస్‌ వినియోగదారులకు కూడా ఈకేవైసీ తప్పని సరి చేశారు. ఇప్పటికే గ్యాస్‌ బుక్‌ చేసిన తరువాత వినియోగదారుని మొబైల్‌ నెంబరుకు ఓటీపీ వస్తేనే బండ ఇస్తున్నారు. జిల్లాలోని 25 గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా ప్రస్తుతం 3,22,279 మంది వినియోగదారులు గ్యాస్‌ పొందుతున్నారు. వీరిలో కేవలం 60వేల మంది (20శాతం) మాత్రమే ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఈకేవైసీ చేయని వినియోగదారులకు గ్యాస్‌ నిలుపుదల చేసేలా కంపెనీలు చర్యలు తీసుకోబోతున్నాయి. ఈమేరకు ఏజెన్సీల నిర్వాహకులందరికీ సందేశం పంపించాయి. వీటన్నింటితోపాటు వ్యక్తి పూర్తిస్థాయి వివరాలు ఆన్‌లైన్‌ వ్యవస్థలో నమోదు కాకపోతే చాలా పథకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. త్వరలో విడుదల చేయనున్న తల్లికి వందనం నగదుకు, రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదు వంటివి జమ కావాలంటే వారి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో ఉన్నాయో లేదో ఇప్పుడే సరిచూసుకోవాలని ఆయా శాఖల అధికారులు సూచిస్తున్నారు.

రైతు వివరాలు నమోదైతేనే ఎరువులు

రైతులకు ఎరువుల సరఫరా కోసం తాజాగా ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్‌ (ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకాల నిర్వహణ వ్యవస్థ 2.0) పేరుతో కొత్తగా యాప్‌ను తెచ్చింది. అందులో ఆధార్‌తో యాప్‌లో రైతు రిజిస్టర్‌ చేసుకుంటేనే ఎరువులు అందుతాయి. ఇందులో రైతు ఆధార్‌తో లింక్‌ అయిన పొలం వివరాలు, ఈక్రా్‌పతో నమోదైన పంట వివరాలను బట్టి ఎంత మోతాదులో ఎరువులు అవసరమో అంతవరకే ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. రైతులంతా ఆధార్‌తో వారి పొలం వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడంతోపాటు ఈ-క్రాప్‌ తప్పనిసరిగా చేసుకుంటేనే ఇక నుంచి సరిపడా ఎరువులు పొందే వీలుంది. ఎరువులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం మంచిదే అయినప్పటికీ రైతుల్లో అవగాహన రాకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.

Updated Date - Jun 12 , 2026 | 02:54 AM