నోబిడ్..!
ABN , Publish Date - May 10 , 2026 | 03:08 AM
పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా సాగాల్సిన సమయంలో నోబిడ్‌లు ఎక్కువయ్యాయి. దీంతో రోజువారీ వేలం కేంద్రాలకు నామమాత్రంగా బేళ్లు వస్తున్నాయి. వాటిని కూడా బయ్యర్లు కొనడం లేదు. కొన్ని వేలం కేంద్రాల్లో కొనుగోలు చేసే వాటి కన్నా తిరస్కరణలే ఎక్కువగా ఉంటున్నాయి.
వారం నుంచి భారీగా తిరస్కరణలు
నిత్యం 50శాతానికిపైగా బేళ్లు వెనక్కి.. కొంటున్న వాటి కన్నా అవే ఎక్కువ
క్రమంగా పడిపోతున్న ధరలు
వేలం ప్రారంభమై నెలన్నర.. కొనుగోలు చేసింది 5.29 మిలియన్ కిలోలే!
వ్యాపారుల నుంచి కనిపించని సానుకూలత
ఏమీ చేయలేని స్థితిలో పొగాకు బోర్డు
తీవ్ర ఆందోళన చెందుతున్న రైతులు
ఇప్పటికే పొదిలి, కందుకూరులలో నిరసనలు
పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా సాగాల్సిన సమయంలో నోబిడ్‌లు ఎక్కువయ్యాయి. దీంతో రోజువారీ వేలం కేంద్రాలకు నామమాత్రంగా బేళ్లు వస్తున్నాయి. వాటిని కూడా బయ్యర్లు కొనడం లేదు. కొన్ని వేలం కేంద్రాల్లో కొనుగోలు చేసే వాటి కన్నా తిరస్కరణలే ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో అధికారులు సూచించిన ధరకు కొనేందుకు బయ్యర్లు ముందుకు రాక నోబిడ్ అవుతున్నవే అత్యధికంగా ఉండటం మార్కెట్ తీరుకు నిదర్శనం. వారంరోజుల నుంచి దారుణ పరిస్థితి నెలకొంది. ధరలు పెరగాల్సిన సమయంలో క్రమంగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా దక్షిణాది పొగాకు మార్కెట్ సంక్షోభం దిశగా నడుస్తోంది.
ఒంగోలు, మే 9 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది ప్రాంతంలో పొగాకు వేలం ప్రారంభించి నెలన్నర గడుస్తున్నా ఇంతవరకూ 5.29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే పొగాకు బోర్డు అధికారికంగా అనుమతిచ్చిన పంటలో ఇప్పటివరకు కొన్నది ఆరుశాతం లోపుగానే ఉంది.ఈ పరిస్థితి నుంచి ఇప్పట్లో మార్కెట్ బయటపడుతుందన్న నమ్మకం ఆ రంగంలో అనుభవం ఉన్న వారిలో కలగడం లేదు. ఈనేపథ్యంలో పొగాకు బోర్డు అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. వ్యాపారుల నుంచి ఏమాత్రం సానుకూలత కనిపించకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దక్షిణాదిన ఒంగోలు కేంద్రంగా ఉన్న రెండు రీజియన్లలో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల పరిధిలో 11 వేలం కేంద్రాలు ఉండగా 2025-26 సీజన్‌కు 88.88 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. ఇతర పంటల సాగు సరిలేక, ధరలు రాకపోవడంతోపాటు వాతావరణం పొగాకు పంటకు అనుకూలించడం, గత మూడేళ్లు ఇతర పంటలతో పోల్చితే ధరలు బాగుండటం వంటి కారణాలతో విస్తారంగా ఈ ప్రాంత రైతులు సాగు చేశారు. ఫలితంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సుమారు 148 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అంచనా వేసిన పొగాకు బోర్డు అధికారులు మార్చి 25న తొలిదశ, ఏప్రిల్ 9న రెండో దశ కొనుగోళ్లను ప్రారంభించారు.
మొదటి నుంచి ఒడిదొడుకులు
గతేడాది కిలోకు రూ.280 ఇచ్చి అనంతరం రూ.370 వరకు పెంచుకుంటూపోయిన వ్యాపారులు ఈ ఏడాది వేలం ప్రారంభం రోజున కేవలం రూ.250 మాత్రమే ఇచ్చారు. దీనికి ముందు సాగుతున్న కర్ణాటక పొగాకు మార్కెట్ కొంత ఒడిదొడుకులు ఎదుర్కొంటుండటంతో కొంత సమయం తర్వాత ఇక్కడ ధరలు పెరుగుతాయన్న సంకేతాలను ఇటు వ్యాపారులు, అటు అధికారులు ఇవ్వడంతో రైతులు కూడా మిన్నకుండిపోయారు. అలా వేలం ప్రారంభించి నెలన్నర గడిచినప్పటికీ మార్కెట్ పుంజుకోకపోగా మరింత దిగజారింది. కొనుగోళ్లు పూర్తిగా మందగమనంలో సాగుతుండగా ధరలు దిగజారుతున్నాయి. కొంతకాలం యుద్ధం పేరుతో, మరికొంతకాలం జీఎస్టీ పెంపు పేరుతో, మరికొంత కాలం కర్ణాటకలో వేలం పూర్తికాలేదన్న సాకులు చెప్పి ధరలు తగ్గించారు. ఆ ముసుగులో నామమాత్రంగా కొంటున్న వ్యాపారులు తాజాగా విదేశీ ఆర్డర్లు ఇంకా ఖరారు కాలేదనే మాట చెప్తున్నారు. దీంతో మార్కెట్ రోజురోజుకూ పతనమవుతోంది.
సగానికి పైగా తిరస్కరణ
మార్కెట్ తీరును శనివారం పరిశీలిస్తే 11 కేంద్రాలకు అమ్మకాల కోసం 3,108 బేళ్లు తీసుకురాగా 1,907 కొనుగోలు చేశారు. అంటే అమ్మకాలకు తెచ్చిన బేళ్లలో సుమారు 39శాతం తిరస్కరణకు గురయ్యారు. ఎస్‌బీఎస్ రీజియన్‌లో తిరస్కరణలు అధికంగా ఉన్నాయి. ఈ రీజియన్‌లో 1,446 బేళ్లను అమ్మకాలకు తెస్తే 686ను కొనుగోలు చేయగా 760 తిరస్కరించారు. అలా ఇక్కడ 52.56 శాతం తిరస్కరణలు జరిగాయి. అంటే ఈ ప్రాంతంలో అమ్మకాలకు తెచ్చిన వాటిలో కొన్న వాటి కన్నా తిరస్కరించినవే అధికంగా ఉన్నాయి. అందులోనూ సుమారు 46.96శాతం బేళ్లు నోబిడ్ చేశారు. మరో ఆరుశాతం ఇతర కారణాలతో వెనక్కి పంపారు. అత్యధికంగా వెల్లంపల్లిలో 68శాతం బేళ్లు తిరస్కరించగా ఒంగోలు-1 కేంద్రంలో 58శాతం, ఒంగోలు-2 కేంద్రంలో 54శాతం, టంగుటూరులో 49శాతం తిరస్కరణలు ఉన్నాయి.
పొదిలి, కందుకూరుల్లో వేలం నిలిపివేత
ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో కందుకూరు, కనిగిరి, పొదిలి కేంద్రాల్లోనూ తిరస్కరణలు అధికంగా ఉన్నాయి. ఈ పరిస్థితిపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గురు, శుక్రవారాల్లో పొదిలి, కందుకూరు కేంద్రాల్లో రైతులు వేలం నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఆ పరిస్థితి ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి, ఇదిలాఉండగా రానున్న రోజుల్లో మార్కెట్ మరింత పతనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొనుగోళ్లపై వ్యాపారుల నుంచి ఏమాత్రం సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. శుక్రవారం గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో వ్యాపార ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించగా విదేశీ ఆర్డర్లు ఇంకా ఖరారు కాలేదని, అవి అయ్యేంత వరకు తాము ఇంతకన్నా మెరుగ్గా సాగలేమని స్పష్టం చేయడం భవిష్యత్ ఇక్కట్లను పట్టిచూపుతోంది. అయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ చక్కదిద్దలేని పరిస్థితుల్లో పొగాకు బోర్డు కనిపిస్తుండటం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.