Share News

కేజీబీవీ బదిలీల్లో కొత్తమలుపు

ABN , Publish Date - Jun 07 , 2026 | 02:41 AM

ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న సిబ్బంది బదిలీల వ్యవహారం మలుపు తిరిగింది. యథాతథ స్థితి కొనసాగించాలని కలెక్టర్‌ రాజాబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

కేజీబీవీ బదిలీల్లో కొత్తమలుపు

యథాతథ స్థితికి కలెక్టర్‌ ఆదేశం

రీకౌన్సెలింగ్‌కు చెక్‌

ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వస్తేనే ముందుకు

ఇక బదిలీలకు తెరపడినట్లే!

ఒంగోలు విద్య, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న సిబ్బంది బదిలీల వ్యవహారం మలుపు తిరిగింది. యథాతథ స్థితి కొనసాగించాలని కలెక్టర్‌ రాజాబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో కేజీబీవీల్లో ఎవరు ఎక్కడ పనిచేశారో వారందరినీ అక్కడే కొనసాగించనున్నారు. ఐదు రోజులుగా కేజీబీవీ సిబ్బంది బదిలీలకు రీకౌన్సెలింగ్‌ అంటూ సాగుతున్న ప్రచారానికి కలెక్టర్‌ చెక్‌ పెట్టారు. బదిలీలకు సంబంధించి సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వస్తేనే తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమకు మినిమం టైమ్‌ స్కేలు అమలు తర్వాతే బదిలీలు చేపట్టాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక ఈ ఏడాది కేజీబీవీ సిబ్బంది బదిలీలకు తెరపడినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

370 మంది దరఖాస్తు

జిల్లాలోని కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బంది 370మంది బదిలీల కోసం దరఖాస్తు చేశారు. వీరిలో తప్పనిసరిగా బదిలీలు కావాల్సిన వారు 197 మంది ఉన్నారు. సుమారు 200 మంది బదిలీ అయ్యారు. బదిలీలకు సంబంధించి సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అంతా మౌఖికంగానే నిర్వహించి వీరికి రీఎంగేజ్‌మెంట్‌ ఉత్తర్వుల్లో కొత్త స్థానాలు ఇమ్మన్నారు. అంటే కోర్టు వివాదాలు రాకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. బదిలీల కౌన్సెలింగ్‌ను ఇక్కడి డీఈవో, ఏపీసీ, జీసీడీవో, బాపట్ల జీసీడీవో తదితరులు నిర్వహించారు. బదిలీల్లో కోరుకున్న వారికి కేటాయించిన స్థానాలకు సంబంధించి ఎస్పీడీ ఆమోదంతో గతనెల వీరికి బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు.

రెండు వర్గాలుగా విడిపోయారు

ఈ క్రమంలో బదిలీల్లో కోరుకున్న స్థానాలు దక్కించుకున్న వారు, కోరుకున్న స్థానాలు దక్కని వారు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో గత సోమవారం జరిగిన ‘మీకోసం’లో కలెక్టర్‌ను కలిసి బదిలీలు పారదర్శకంగా జరిగాయని, వాటినే కొనసాగించాలని ఒక వర్గం వారు కోరగా, తమకు ఎంటీఎస్‌ అమలుచేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని మరోవర్గం వారు విన్నవించారు. ఈనేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి వెబెక్స్‌లో కేజీబీవీ బదిలీలు రద్దు చేస్తున్నామని, రీకౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. విషయం కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లకుండానే ఈ ప్రకటన చేశారు. జూన్‌ 5న రీకౌన్సెలింగ్‌ నిర్వహణకు జాబితాలు సిద్ధం చేయాలని సమగ్ర శిక్ష కేజీబీవీ విభాగాన్ని ఆదేశించారు. ఈక్రమంలో ఈనెల 3న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కేజీబీవీ సిబ్బంది బదిలీల్లో లోల్లి వార్తపై వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో బుధవారం డీఈవో, ఏపీసీలు ఇరువురు కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివాదాల జోలికి వెళ్లకుండా బదిలీలపై యథాతథ స్థితిని కొనసాగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్పీడీ నుంచి బదిలీలకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వస్తేనే ముందుకు వెళ్లాలని సూచించారు.

Updated Date - Jun 07 , 2026 | 02:41 AM