Share News

ఎస్‌ఎంసీ ఎన్నికలకు కొత్త నిబంధనలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:21 AM

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ స్కూళ్లలో ఈనెల 29న జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల మేరకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎస్‌ఎంసీ ఎన్నికలకు కొత్త నిబంధనలు

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నిర్వహణ

పాఠశాల యూనిట్‌గా సభ్యుల ఎన్నిక

ఒంగోలు విద్య, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ, ప్రభుత్వ రంగ స్కూళ్లలో ఈనెల 29న జరగనున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల మేరకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో పాఠశాలలోని తరగతి యూనిట్‌గా ఎస్‌ఎంసీ సభ్యులను ఎన్నుకునేవారు. ప్రస్తుతం ఆ విధానం మారింది. మొత్తం పాఠశాల యూనిట్‌గా ఇప్పుడు ఎస్‌ఎంసీ సభ్యులను ఎన్నుకోనున్నారు. ప్రతి ఎస్‌ఎంసీ సభ్యుడిని పాఠశాలలోని ఓటర్లందరూ ఎన్నుకోవాలి. దీనికోసం గతంలో మాదిరిగా తల్లిదండ్రులను ఆయా తరగతి గదుల్లో కాకుండా అన్ని తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలో ఒకేచోట సమావేశ పరిచి ఎన్నికలు నిర్వహించాలి. ప్రతి తరగతికి ప్రాతినిథ్యం ఉండేలా సభ్యులను ఎన్నుకోవాలి. పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల్లో ఒకరికి మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అంతకంటే ఎక్కువమంది విద్యార్థులు ఉన్నా వారి తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు. అయితే తల్లిదండ్రుల్లో తల్లికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. తల్లి లేకపోతే తండ్రికి, తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే సంరక్షకునికి ఓటుహక్కు ఉంటుంది. అయితే వీరి పేరు తప్పనిసరిగా విద్యార్థి ప్రవేశ దరఖాస్తులో నమోదై ఉండాలి. ఓటింగ్‌ విషయంలో కోరం అంటే విద్యార్థుల సంఖ్యను కాకుండా తల్లిదండ్రులు, ఓటర్ల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఓటర్లలో 50శాతం మంది హాజరైతే ఎన్నికలు నిర్వహించవచ్చు. ఏదైనా పాఠశాలలో గరిష్టంగా 12 మంది మాత్రమే విద్యార్థులు ఉంటే అక్కడ ఎస్‌ఎంసీ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదు. పిల్లల తల్లిదండ్రులందరూ ఆటోమేటిక్‌గా ఎస్‌ఎంస్‌సీ సభ్యులు అవుతారు.

Updated Date - Sep 24 , 2026 | 03:21 AM