Share News

నిత్యయోగా సాధనతో నూతన శక్తి

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:08 AM

నిత్యం యోగా సాధన చేయటం ద్వారా శరీరానికి, మనసుకు నూతన శక్తి, ఉత్తేజం కలుగుతాయని జేసీ కల్పనాకుమారి చెప్పారు.

నిత్యయోగా సాధనతో నూతన శక్తి
యోగా సాధన సభ్యులతో జేసీ కల్పనాకుమారి

జేసీ కల్పనాకుమారి

గాంధీపార్క్‌లో పొదుపు మహిళలతో యోగాసనాలు

ఒంగోలు కల్చరల్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి) : నిత్యం యోగా సాధన చేయటం ద్వారా శరీరానికి, మనసుకు నూతన శక్తి, ఉత్తేజం కలుగుతాయని జేసీ కల్పనాకుమారి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న యోగా సాధనలో భాగంగా శుక్రవారం ఒంగోలు గాంధీపార్కులో స్వయం సహాయక సంఘాల సభ్యులతో యోగా సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జేసీతోపాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెప్పారు. బాలాజీ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. డాక్టర్‌ సీతారామయ్య మాట్లాడుతూ జీవనశైలిని మార్చుకోవటం ద్వారా దీర్ఘాయువు, ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని, ఇందుకు యోగా సాధన అత్యుత్తమ మార్గమని చెప్పారు. పతంజలి యోగా సంస్థ నిపుణుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్‌, యోగాంధ్ర నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భీమ్‌నాధ్‌, ఆర్డీవో చంద్రశేఖర్‌ నాయుడు, ఒంగోలు మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్‌ ఆర్‌.వెంకట్రావు పాల్గొన్నారు.


22 నుంచి యోగా శిక్షణ

పతంజలి యోగా సంస్థ తరఫున ఈ నెల 22 నుంచి ఒంగోలు కొత్తకూరగాయల మార్కెట్‌ దగ్గర ఉన్న రెడ్‌క్రాస్‌ భవనంలో రోజూ యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పతంజలి యోగా గురువు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని, వివరాల కోసం 9618701010 నెంబరులో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:08 AM