నిర్వాసితులపై కొత్త డ్రామా
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:13 AM
వెలిగొండ నిర్వాసితుల్లో ప్రజాప్రభుత్వం పట్ల వ్యక్తమైన సానుకూలత, యావత్ పశ్చిమ ప్రాంత ప్రజల్లో ప్రాజెక్టు పూర్తిపై నమ్మకం ఏర్పడటాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సరికొత్త డ్రామాకు శ్రీకారం పలికారు.
నలుగురిని వెంటేసుకుని అమరావతి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే
అగ్రభాగాన ఉన్న దళారులు
మిగిలిన లబ్ధిదారుల కోసం ముందుగానే జేసీ సమావేశం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
వెలిగొండ నిర్వాసితుల్లో ప్రజాప్రభుత్వం పట్ల వ్యక్తమైన సానుకూలత, యావత్ పశ్చిమ ప్రాంత ప్రజల్లో ప్రాజెక్టు పూర్తిపై నమ్మకం ఏర్పడటాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సరికొత్త డ్రామాకు శ్రీకారం పలికారు. ఆ పార్టీకి చెందిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అమరావతికి వెళ్లి హడావుడి చేస్తూ మొసలి కన్నీరు కార్చే డ్రామాకు తెరతీశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాంతానికి రావడమే కాక 2,300మంది నిర్వాసితులకు రూ.300 కోట్లను నష్టపరిహారంగా అందించారు. దీంతో ప్రజాప్రభుత్వం పట్ల ఏర్పడిన సానుకూలతను తట్టుకోలేక వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందిన ఆదేశాలతో రంగంలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అఽధికారంలో ఉన్న ఐదేళ్లూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి పునరావాసాన్ని పట్టించుకోకుండానే ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని ఇటీవల నీటి పారుదలశాఖ మంత్రి రామానాయుడు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. మూడు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నష్టపరిహారం చెల్లింపునకు ఇటీవల ప్రజాప్రభుత్వం శ్రీకారం పలికింది. రానున్న నాలుగు నెలల్లో టన్నెల్-1 ద్వారా ప్రాజెక్ట్ రిజర్వాయర్ నుంచి నీరు కూడా విడుదల చేయను న్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఒక్కసారిగా రూ.908కోట్లు విడుదల చేయడంతోపాటు తొలివిడతగా రూ.300కోట్లు అందించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కొందరు వైసీపీ శ్రేణులను తీసుకువెళ్లి నిర్వాసితులకు నష్టపరిహారం విషయంలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఆపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు నోరు మెదపలేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కో లబ్ధిదారునికి రూ.12లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు రైతులను రెచ్చగొట్టి వైసీపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి రూ.18లక్షల నష్టపరిహారం ఇస్తామని అప్పటివరకు తీసుకోవద్దని రెచ్చగొట్టారు. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి నష్టపరిహారాన్ని రూ.18 లక్షలకు పెంచాలని అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అడిగిన దాఖలాలు లేవు. అంతెందుకు ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి జాతికి అంకితం పేరుతో మార్కాపురం వచ్చి ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో కూడా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలన్న విషయాన్ని అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ప్రస్తావించలేదు.
ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్ట్ పూర్తిపై దృష్టిపెట్టింది. అలాగే పూర్తిచేయకుండానే జాతికి అంకితం పేరుతో వైసీపీ చేసిన మోసాన్ని బయటపెట్టి మిగిలిపోయిన కాలువ పనుల పూర్తికి శ్రీకారం పలికింది. ఆ సందర్భంలోనే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. తాజాగా వైపాలెం నియోజకవర్గంలోని ముంపుగ్రామాలైన కలనూతల, గుండంచర్ల, సుంకేసుల గ్రామాల్లో కొందరు నిర్వాసితులకు న్యాయం జరగడం లేదంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అమరావతికి వెళ్లి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఆయన వైసీపీ వైపాలెం నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు కాగా, ఎమ్మెల్యే అయి రెండేళ్లు అయ్యింది. కానీ ఆయనకు ఈ సమస్య ఇప్పుడు గుర్తుకు వచ్చింది. మరోవైపు ఆయనతోపాటు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిన వారిలో తమకు నష్టపరిహారం ఇప్పిస్తామని రైతుల వద్ద డబ్బులు గుంజిన దళారులు ఉన్నట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
నెల క్రితమే సమీక్ష చేసిన అధికారులు
రెండు మూడు మాసాల క్రితమే ఈ అంశంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు సుంకేసుల గ్రామంలో 30 కుటుంబాల వారు నష్టపరిహారం పొందే లబ్ధిదారుల జాబితాలో చేరలేదని గుర్తించారు. దీంతో ఆయన ఆ గ్రామాలతోపాటు మిగిలిన చోట్ల పర్యటించారు. తర్వాత మంత్రి రామానాయుడు దృష్టికి విషయం తీసుకెళ్లారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వద్ద సమస్యలను వివరించారు. ఆయన పదేపదే తిరగడంతో సుమారు నెలక్రితం జాయింట్ కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్ష చేశారు. ఆ తర్వాత లబ్ధిదారులు ఎవ్వరైనా మిగిలిపోయారా? అనే అంశంపై పరిశీలన చేశారు. ఇటీవల వెలిగొండ వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి కూడా టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఈ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన కూడా మరోసారి పరిశీలించి ఎవరైనా మిగిలిపోతే వారిని కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో వైసీపీ ఎమ్యెల్యే చంద్రశేఖర్ లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని హడావుడి చేయడం ప్రారంభించారు.