గుండ్లకమ్మపై కొత్త బ్రిడ్జి
ABN , Publish Date - Oct 28 , 2026 | 02:10 AM
అద్దంకి పట్టణానికి సమీపంలోని గుండ్లకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరి రేపోమాపో కూలేందుకు సిద్ధంగా ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఒకసారి బ్రిడ్జి కొన్ని ఖానాల మధ్య కుంగటంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కాలం వెళ్లదీస్తున్నారు.
రూ.35 కోట్లతో ప్రతిపాదనలు
ప్రభుత్వం నుంచి త్వరలో మంజూరు కానున్న నిధులు
అద్దంకి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి పట్టణానికి సమీపంలోని గుండ్లకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరి రేపోమాపో కూలేందుకు సిద్ధంగా ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఒకసారి బ్రిడ్జి కొన్ని ఖానాల మధ్య కుంగటంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మాణంపై దృష్టి సారించారు. భారీ వ్యయంతో నిర్మించాల్సి రావడంతో నిధుల లభ్యత కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అద్దంకి పర్యటనకు వచ్చిన సమయంలో గుండ్లకమ్మపై కొత్త బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. ఈక్రమంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.35 కోట్ల నిధులు అవసరమని ఆర్అండ్బీ అధికారులు నివేదిక అందజేశారు. ఆశాఖ మంత్రి ఆమోదముద్ర వేయడంతో నిధుల మంజూరుకు ప్రభుత్వం వద్దకు చేరింది. త్వరలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. అద్దంకి, దర్శి నియోజకవర్గాలలోని పలుగ్రామాల నుంచి అద్దంకి చేరుకోవాలంటే ఈబ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగించాల్సి ఉంది. అదేసమయంలో మార్కాపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ, గుంటూరు, అమరావతి వెళ్లేందుకు దగ్గరి మార్గంగా ఉండటంతో అద్దంకి, దర్శి మీదుగా ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. రెండు దశాబ్దాల క్రితం గుండ్లకమ్మ నదిపై ఉన్న బ్రిడ్జి కొంతమేర కుంగింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగగా అప్పట్లో గుండ్లకమ్మ నదిలో నీటిప్రవాహం లేకపోవడం, రిజర్వాయర్ నిర్మాణం జరక్కపోవడంతో తాత్కాలిక రహదారి నిర్మాణం ఏర్పాటుచేసి రాకపోకలు చేపట్టారు. అనంతరం బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించారు. భారీ వాహనాలు ప్రయాణించే సమయంలో బ్రిడ్జి ఊగుతుంది. ఎప్పుడు కుంగుతుందోనని వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో త్వరలో నిధులు మంజూరు కానుండటంతో కొత్త బ్రిడ్జి నిర్మాణం జరగనుంది.