బీఎల్వోల నిర్లక్ష్యం
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:35 PM
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (ఓటర్ల జాబితా సవరణ) కార్యక్రమంలో కొన్నిచోట్ల బీఎల్వోల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
‘సర్’ కార్యక్రమంలో అంటీముట్టనట్లుగా...
ఓట్ల పరిశీలనకు ఇంటింటికీ వెళ్లని కొందరు
బీఎల్‌ఏల చేతిలో ఎన్యుమరేషన్ ఫాంలు
మార్కాపురం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (ఓటర్ల జాబితా సవరణ) కార్యక్రమంలో కొన్నిచోట్ల బీఎల్వోల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 1,103 మంది బూత్ లెవల్ అధికారులు పాల్గొంటున్నారు. 108 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 9,08,772 మంది ఓటర్లకు సంబంధించిన ఫాంలు జిల్లాకు వచ్చాయి. బీఎల్వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వెళ్లాలి. ఎన్యుమరేషన్ ఫాం ఇచ్చి ఓటర్లు నింపిన తరువాత వాటిని తిరిగి తీసుకోవాలి. కానీ పలుచోట్ల బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లకుండా ఎన్యుమరేషన్ ఫాంలను బయట వ్యక్తుల ద్వారా పంపుతున్నారని తెలుస్తోంది. కొన్నిచోట్ల బీఎల్‌ఏలుగా ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధుల చేతికి ఇవ్వటంతో వారు వారి పార్టీ ఓటర్లకు ఫాంలను అందజేసి వాళ్లే పూరించి తెచ్చి బీఎల్వోలకు ఇస్తున్నారు. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో నిర్లక్ష్యం కారణంగా తప్పులు దొర్లే అవకాశాలు ఉన్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజులు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి 2,05,064 ఫాంలు పంపిణీ చేశామని నివేదికలే తప్ప వాస్తవానికి చాలామంది ఇంటింటికీ వెళ్లలేదనేది ప్రధాన ఆరోపణ. జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.