Share News

నిర్లక్ష్యమా.. భూ స్కామా?

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:31 AM

కనిగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డుల మాయం వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట అధికారుల నిర్లక్ష్యమని భావించగా, ఇప్పుడు దాని వెనుక భూముల లావాదేవీలకు సంబంధించి పెద్ద స్కాం ఉన్నట్లు తెలుస్తోంది.

నిర్లక్ష్యమా.. భూ స్కామా?
కనిగిరి తహసీల్దార్‌ కార్యాలయం

రెవెన్యూ రికార్డుల మాయంపై అనేక ఆరోపణలు

5నెలల తర్వాత ఫిర్యాదు వెనుక అనుమానాలు

కనిగిరి అర్బన్‌ పరిధిలోని వివిధ గ్రామాల

భూ రికార్డులపై ప్రజల ఆందోళన

కనిగిరి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డుల మాయం వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. మొదట అధికారుల నిర్లక్ష్యమని భావించగా, ఇప్పుడు దాని వెనుక భూముల లావాదేవీలకు సంబంధించి పెద్ద స్కాం ఉన్నట్లు తెలుస్తోంది. మాయమైనఫైళ్లలో ఎక్కువ భాగం భూమి రికార్డులేనని సమాచారం. ముఖ్యంగా కనిగిరి అర్బన్‌ ప్రాంతంలోని వివిధ గ్రామాలకు చెందిన విలువైన భూములు, వివాదాస్పద స్థలాలు, పాస్‌బుక్స్‌కు సంబంధించిన పత్రాలు కనిపించడం లేదని తెలుస్తోంది. వాటిలో ఈ ఏడాది జనవరికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నట్లు సమాచారం. అర్బన్‌ ఏరియాకు చెందిన భూముల మార్పిడి స్కాంకు డీల్‌ కుదిరిన నేపథ్యంలోనే ఈ రికార్డులు మాయమైనట్లు పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీని వెనుక తహసీల్దార్‌, వీఆర్‌వోల పాత్ర ఏమిటన్నది తేలాల్సి ఉంది. పామూరు రోడ్డు, పొదిలి రోడ్డులోని ప్రధాన హైవే నుంచి సమీప గ్రామాలకు చెందిన భూరికార్డులు కూడా గల్లంతైనట్లు ఆరోపణలున్నాయి. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడడంతో కనిగిరి ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంతమంది పరాయి ప్రాంతాలకు చెందిన బడానేతలు రెవెన్యూ అధికారులతో పెద్దఎత్తున ఒప్పందం కుదుర్చుకుని భూముల స్వాహాకు పన్నాగం పన్నినట్లు సర్వత్రా చర్చ నడుస్తోంది.

ఫిర్యాదు ఆలస్యం, సీసీ కెమెరాల మిస్టరీపై ప్రశ్నలు

రెవెన్యూ రికార్డుల మాయం ఉదంతంపై తహసీల్దార్‌ చేసిన ఫిర్యాదు సమయం కూడా వివాదాస్పదంగా మారింది. బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల తర్వాత రికార్డులు మాయమయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఘటన ముందే తెలిసి దాచారా? లేక ఇటీవలే జరిగిందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కార్యాలయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది యాధృచ్ఛికమా లేక ముందే ప్రణాళిక ప్రకారం వాటిని చెడగొట్టి నిలిపేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

లోపలి వ్యక్తులు, రెవెన్యూ సిబ్బందిపై అనుమానాలు

రికార్డు గదికి యాక్సెస్‌ ఉన్న సిబ్బంది వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారి హాజరు రిజిస్టర్లు, విధుల మార్పులను పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందా అనే అనుమానంతో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో భూమి యజమానులు, ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ భూమి రికార్డులు సురక్షితంగా ఉన్నాయా అన్న సందేహం వెలిబుచ్చుతున్నారు. రికార్డుల భద్రతలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌కు వివిధ ప్రశ్నలతో కూడిన సమాధానాలను అడిగినట్లు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. రికార్డుల మాయం వెనుక అసలు సత్యం ఏమిటి..? నిర్లక్ష్యమా.. లేక భారీ స్కామా..?అన్న దానిపై స్పష్టత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Apr 18 , 2026 | 01:31 AM