Share News

‘సర్‌’ నిర్వహణలో నిర్లక్ష్యం

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:11 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నిర్వహణ పట్ల క్షేత్రస్థాయిలో బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సర్‌ కార్య క్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మ కంగా నిర్వహించగా మన రాష్ట్రంలో గతనెల 15వతేదీ నుంచి ప్రారంభించింది.

‘సర్‌’ నిర్వహణలో నిర్లక్ష్యం

కలెక్టర్‌ రాజాజాబు సీరియస్‌

13మంది బీఎల్వోలకు షోకాజ్‌ నోటీసులు

దర్శి పట్టణంలో ఒక బీఎల్వో కేవలం ఏడు పత్రాలు మాత్రమే అందజేత

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నిర్వహణ పట్ల క్షేత్రస్థాయిలో బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సర్‌ కార్య క్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మ కంగా నిర్వహించగా మన రాష్ట్రంలో గతనెల 15వతేదీ నుంచి ప్రారంభించింది. జూలై 14వ తేదీకి ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో తదనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 1,649 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 13.99లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ముందుగా ఎన్యుమరేషన్‌ ఫాంలు ఇచ్చి ఆ తర్వాత వాటిని 2002 ఓటర్ల జాబితాను పరిశీలించి మ్యాపింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫాంలను ఆయా పోలింగ్‌ కేంద్రాల వారీగా జారీచేశారు.

నిర్లక్ష్యంగా ఉంటున్న బీఎల్వోలు

ఎన్యుమరేషన్‌ ఫాంలను ఓటుదారులకు ఇచ్చే విషయంలో బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 13మంది బూత్‌లెవల్‌ అధికారులు ఎన్యుమరేషన్‌ ఫాంల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరికొంత మంది అయితే అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో 1200కు పైగా ఓట్లు ఉండగా కేవలం ఏడుగురికి మాత్రమే ఎన్యుమరేషన్‌ ఫాంలు ఇచ్చి పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నికల సెల్‌ అధికారులు కలెక్టర్‌ రాజాబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 13 మంది బూత్‌లెవల్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఐదారు శాతమే డిజిటలైజేషన్‌

ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్‌ ఫాంలను సంబంధిత పత్రాలతో సహా సేకరించి వాటిని డిజిటలైజేషన్‌ (కంప్యూటరీకరణ) చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో 90శాతానికిపైగా ఫాంలు పంపిణీ చేసినా డిజిటలైజేషన్‌లో జిల్లా వెనుకబడిపోయింది. జిల్లాలో 1,649 పోలింగ్‌ కేంద్రాల్లో కేవలం ఒక పోలింగ్‌ కేంద్రంలో మాత్రమే నూరుశాతం డిజిటలైజేషన్‌ పూర్తికాగా 90శాతం డిజిటలైజేషన్‌ ఏడు కేంద్రాలు, 60శాతం 67 కేంద్రాలు, 47శాతం 309 కేంద్రాలు, 30శాతం 807 పోలింగ్‌ కేంద్రాల్లో డిజిటలైజేషన్‌ చేశారు. 480 కేంద్రాల్లో కేవలం 20శాతంలోపు మాత్రమే డిజిటలైజేషన్‌ పూర్తిచేశారు. కొన్ని కేంద్రాల్లో అయితే ఐదారు శాతం కూడా డిజిటలైజేషన్‌ చేయలేదు. ఎన్యుమరేషన్‌ ఫాంల పంపిణీ, ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బూత్‌ లెవల్‌ అధికారులపై చర్యలు తీసుకునేందుకు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు సమాచారం.

Updated Date - Jul 02 , 2026 | 03:11 AM