Share News

నేడు నీట్‌.. ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Jun 21 , 2026 | 02:58 AM

ఒంగోలు లో ఆదివారం జరిగే నీట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. పరీక్షలు జరిగే ఒంగోలులోని ఆరు కేంద్రాలను శనివారం ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి ఆయన పరిశీలించారు.

నేడు నీట్‌.. ఏర్పాట్లు పూర్తి
ఒంగోలులో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఆరు కేంద్రాలు, 1,821 మంది అభ్యర్థులు

ఎస్పీతో కలిసి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు లో ఆదివారం జరిగే నీట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. పరీక్షలు జరిగే ఒంగోలులోని ఆరు కేంద్రాలను శనివారం ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి ఆయన పరిశీలించారు. ఒంగోలులోని నవోదయ, కేంద్రీయ విద్యాలయం, దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాల, డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలు, పీవీఆర్‌ బాలుర పాఠశాలలను నీట్‌ పరీక్షకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచిన కర్నూలు రోడ్డులోని ఎస్‌బీఐ లాకర్‌ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ ఆరు కేంద్రాల్లో 1,821 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఎన్‌టీఏ ఆదేశాల మేరకు మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు వంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు ఆయా కేంద్రాల్లో అవసరమైన పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యంతోపాటు వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ద్వారా రవాణా సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్లు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆరు కేంద్రాలను రెండు జోన్లుగా విభజించి మరింత భద్రత, పర్యవేక్షణ కోసం ప్రతి జోన్‌కు అదనంగా ఇన్‌స్పెక్టర్లను కూడా కేటాయించామన్నారు. ఒంగోలుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండు, రైల్వేస్టేషన్లలో కూడా పోలీసుల ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి వెంట డీఆర్వో మాధురి, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, పరీక్షల కోఆర్డినేటర్‌ మనీష్‌ ఉన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం

నీట్‌ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 వరకు జరగనుంది. దివ్యాంగ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.20 వరకు ఉంటుంది. కేంద్రాల్లోకి అభ్యర్థులను గంట ముందుగా అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను హాలులోకి అనుమతించరు. విద్యార్థులను బయట పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపుతారు.

Updated Date - Jun 21 , 2026 | 02:58 AM