అధ్వానంగా ఎన్‌ఏపీ నిర్వహణ
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:52 PM
దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది.ఎంతోకాలంగా ఫిల్టర్ బెడ్లు పనిచేయ టం లేదు. క్లోరినేషన్ సక్రమంగా కావటం లేదు.
పనిచేయని ఫిల్టర్‌బెడ్లు
కలుషిత నీరు సరఫరా చేస్తున్న అధికారులు
అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
దర్శి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి) : దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అధ్వాన్నంగా తయారైంది.ఎంతోకాలంగా ఫిల్టర్ బెడ్లు పనిచేయ టం లేదు. క్లోరినేషన్ సక్రమంగా కావటం లేదు. సంపు గోడలు పూర్తిగా దెబ్బతిని కూలేదశకు చేరా యి. నీరు రంగు మారి పురుగులు కూడా కలిసి వస్తున్నాయి.కలుషిత నీరు తాగలేక ప్రజలు ఇబ్బం ది పడుతున్నారు. 129 గ్రామాలకు మంచినీరు అందించే పథ కం అస్తవ్యస్తంగా మారటంతో తాగునీటి సమస్య అధికమైంది.
దర్శి ఎన్‌ఏపీ పథకం అభివృద్ధి గురించి ఎన్నో ఏళ్లుగా పాలకులు పట్టించుకోవటం లేదు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో పథకం మరింత అధ్వానపు స్థితికి చేరింది. ఎన్‌ఏపీ మంచినీటి చెరువు పూడిపోయి నీటి సామర్థ్యం తగ్గిపోయింది. జనాభా రెట్టింపు అయింది. దీంతో రోజు నీటి వాడకం కూడా రెట్టింపు కావటంతో చెరువులో నీరు త్వరగా ఖాళీ అవుతున్నాయి.
పడిపోయిన నిల్వ సామర్థ్యం
దర్శి ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి సామర్థ్యం 2538 మిలియన్ లీటర్లు కాగా ప్రస్తుతం 1000 మిలియన్ లీటర్లు మాత్రమే నీరు నిల్వ ఉంది. అందులో 500 మిలియన్ లీటర్లు అడుగు భాగాన బురదలో కలిసి ఉంటాయి. కేవలం 500 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరాకు అందుబాటులో ఉంటాయి. ఆ నీరు కూడా రంగుమారి ఉండటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పైపులైన్లు తరచూ పగిలిపోతూ నీటి సరఫరాకు తీవ్ర ఆటంకంగా మారింది. ప్రస్తుతం మూడురోజులకొకమారు నీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలకు అవిసరిపోవడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులుపడుతున్నారు. సుమారు 45 ఏళ్ల క్రితం నెదర్లాండ్ ఆర్థిక సహయంతో ఈ పథకాన్ని నిర్మించారు. ఫిల్టర్ బెడ్ల అత్యవసర మరమ్మతులకు రూ.2కోట్లు నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. యుద్ధప్రాతిపదికన ఫిల్టర్‌బెడ్లు మరమ్మతులు చేసి స్వచ్ఛమైన నీరందించకపోతే ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది.