వెలుగులోకి నంది శాసనం
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:39 AM
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం పొలాల్లో 15వ శతాబ్దం నాటి నంది శాసనం వెలుగుచూసింది. పురావస్తు శాఖ నల్లమల ప్రాంత శాసనాలపై చేస్తున్న అధ్యయ నంలో భాగంగా సోమవారం గుర్తించినట్లు శాసనపరిశీల కులు, సాహితీవేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు.
పెద్దబొమ్మలాపురం పొలాల్లో గుర్తింపు
నల్లమల ప్రాంత శాసనాలపై పురావస్తు పరిశోధన శాఖ అధ్యయనం
పెద్దదోర్నాల, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం పొలాల్లో 15వ శతాబ్దం నాటి నంది శాసనం వెలుగుచూసింది. పురావస్తు శాఖ నల్లమల ప్రాంత శాసనాలపై చేస్తున్న అధ్యయ నంలో భాగంగా సోమవారం గుర్తించినట్లు శాసనపరిశీల కులు, సాహితీవేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు. ఈనెల 11వతేదీ నుంచి మైసూరుకు చెందిన భారతీయ పురావస్తు పరిశోధన శాఖ బృందం డైరెక్టర్ ఎం.మునిరత్నంరెడ్డి ఆధ్వర్యంలో నల్లమల ప్రాంతాలలో శాసనాలను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం వైపాలెం మండలం పాలుట్లలో లభించిన శాసనాన్ని పరిశీలించగా విజయనగర సామ్రాజ్య రెండో దేవరాయలు కాలం క్రీ.శ. 1436 అక్టోబరు 18వతేదీ నాడు ఏర్పాటు చేసినదిగా గుర్తించినట్లు వీరారెడ్డి తెలిపారు. అదేవిధంగా పెద్దబొమ్మలాపురం పొలాల్లో వెలుగుచూసిన నంది శాసనం కూడా పాలుట్ల శాసనం కన్నా ఒక్క రోజు ముందుగా అంటే క్రీ.శ. 1436 అక్టోబరు 17వతేదీన ఏర్పాటు చేసినట్లుగా వెల్లడైందని చెప్పారు. ఈ నంది శాసనం 79 వరుసలో చెక్కినట్లుగా శ్రీపర్వత మల్లికార్జునస్వామి ఆలయ నిర్వహణ కోసం 400 వరహాలను భిక్షావృత్తి అయ్యంగార్ స్వామికి దానమిచ్చినట్లు ఉందన్నారు. అంతేగాక ఉదయగిరి రాజ్యంలోని మల్లాపురానికి చెందిన సనాతనపురం, కాల్వపల్లి గ్రామాలను బహూకరించినట్లు తెలుపుతుందన్నారు. శ్రీశైలం నడకమార్గాన 20 కిలోమీటర్ల దూరంలో వెలుగుచూసిన పాలుట్ల, పెద్ద బొమ్మలాపురం శాసనాలు కేవలం ఒక్కరోజు తేడాతోనే ఉండటం నాటి రాజుల అవిశ్రాంత ప్రయాణానికి, దాతృత్వానికి దర్పణం పడుతున్నాయన్నారు. ఇంకా ఎన్నో పురాతన శాసనాలు నల్లమలలో వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.