ముసికి సాగర్ నీరు
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:56 AM
కరువు, వర్షాభావ సమయంలో ముసి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజల నీటి ఇక్కట్లను తీర్చేందుకు ఉద్దేశించిన సాగర్ జలాలను ముసికి మళ్లించే పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి చేసిన కృషి ఫలించింది.
మంత్రి డాక్టర్ స్వామి చొరవతో మార్గం సుగమం
ఏడాది క్రితమే 0.66 టీఎంసీలు కేటాయింపు
తాజాగా రూ.50లక్షలతో ఎస్కేప్ రెగ్యులేటర్
పది కిలో మీటర్ల మేర వాగు ఆధునికీకరణ
కరువు, వర్షాభావ సమయంలో ముసి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజల నీటి ఇక్కట్లను తీర్చేందుకు ఉద్దేశించిన సాగర్ జలాలను ముసికి మళ్లించే పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి చేసిన కృషి ఫలించింది. ఏడాది క్రితమే 0.66 టీఎంసీల నీటిని సాగర్ కాలువల నుంచి పొందేందుకు అధికారికంగా ఉత్తర్వులను ఆయన సాధించారు. అనంతరం కాలువ నుంచి ఏరులోకి నీరు వచ్చేందుకు అవసరమైన పనులపై దృష్టి సారించారు. రూ.50లక్షల వ్యయంతో ఎస్కేప్ రెగ్యులేటర్ నిర్మాణం, అక్కడి నుంచి ఏరులోకి నీరు వచ్చేలా పది కిలోమీటర్ల దూరం ఆధునికీకరణ పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. దీంతో సాగర్ కాలువలో నీరు వచ్చే సమయంలో దాన్ని ముసిలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది.
ఒంగోలు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు-కర్నూలు రోడ్డులో ముసి బ్రిడ్జి దాటిన తర్వాత ఒకవైపు సంతనూతలపాడు నియోజకవర్గం, మరోవైపు కొండపి నియోజకవర్గంలోని గ్రామాలు ఉంటాయి. అలా సుమారు 30 ఊళ్ల వరకూ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వివిధ గ్రామాలకు చెందిన తాగునీటి పథకాలు, అక్కడక్కడా ఎత్తిపోతలు, పలుచోట్ల ఆ పరివాహకం ఆధారంగా ఇరువైపులా బోర్లు, ఇతరత్రా ఉన్నాయి. ముసిలో ప్రవాహం ఉండే సమయంలో వాటన్నింటిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది. ఒక్కోసారి సీజన్ చివరిలో లేదా వర్షాభావ సమయాల్లో ఏరులో నీటి లభ్యత లేక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సాగర్ జలాలే ప్రత్యామ్నాయం
పదేళ్ల క్రితం ఒకసారి ముసిలో నీటి ప్రవాహం లేక పరిసర గ్రామాల్లో పంటలు ఎండి పోవడంతోపాటు తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఆ సమ యంలో రామతీర్థం రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలోని ఎన్‌ఎస్‌పీ ఒంగోలు బ్రాంచి కాలువ నుంచి కొంత నీటిని జర్రిపోతుల వాగు ద్వారా ముసికి మళ్లించే అవకాశం ఉందన్న సమా చారం అప్పుడు కొండపి ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి డాక్టర్ స్వామి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి ఒంగోలు బ్రాంచి కాలువపై వెలుగువారిపాలెం సమీపంలో ఉన్న ఎస్కేప్ నుంచి జెర్రిపోతుల వాగులోకి నీరు విడుదల చేయించారు. దీంతో ముసి పరివాహక ప్రాంత గ్రామాలకు మేలు చేకూరింది.
ప్రజా ప్రభుత్వం వచ్చాక కదలిక
శాశ్వతంగా సాగర్ నీటిని అవసరమైనప్పుడు ముసికి ఇచ్చేలా ప్రభుత్వం నుంచి అధికారికంగా అనుమతులు పొందాలని డాక్టర్ స్వామి గత టీడీపీ ప్రభుత్వ హయాం లోనే నిర్ణయించుకొన్నారు. అందుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్దికాలానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆవి ఆగిపోయాయి. తిరిగి 2024లో కూటమి అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ స్వామి మంత్రి కూడా కావడంతో ఈ అంశంపై దృష్టి సారించారు. గత ఏడాది ఫిబ్రవరి 6న అందుకోసం ప్రభుత్వానికి తన నియోజకవర్గ ప్రజల తరఫున లేఖ రాశారు. దానిని పరిశీలిం చిన జలవనరులశాఖ.. స్థానిక అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకొని ఎన్‌ఎస్పీ ఒంగోలు బ్రాంచి కాలువ 23.17 కి.మీ వద్ద ఉన్న ఎస్కేప్ రెగ్యులేటరీ నుంచి 0.60 టీఎంసీల నీటిని ముసికి ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు గత ఏడాది ఆగస్టు 6న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఆధునికీకరణ పనులు పూర్తి
ఓబీసీపై ఎస్కేప్ తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం సమీపంలో ఉండగా అక్కడ రెగ్యులేటర్, షట్టర్లు నిర్మించాలి. అక్కడి నుంచి వెలుగువారిపాలెం, దేవరపాలెం, నిప్పట్లపాడు, మర్రిచెట్లపాలెం గ్రామాల సమీపం నుంచి ముసి వరకు సుమారు 10 కి.మీ దూరం ఉండే జెర్రిపోతుల వాగు పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్, ఇతర ఆధునికీకరణ పనులు చేస్తేనే ముసికి సజావుగా నీటిని తీసుకునే అవకాశం ఉంది. దానిని గుర్తించిన మంత్రి స్వామి సంబంధిత అధికారులతో మాట్లాడి ఎన్‌ఎస్‌పీ విభాగం నుంచి రూ.30లక్షలు మంజూరు చేయిం చారు. ఎస్కేప్ రెగ్యులేటర్ నిర్మాణం, షట్టర్ల పనులు అలాగే రెగ్యులర్ ఇరిగేషన్ విభాగం నుంచి రూ.20లక్షలతో వాగు అ భివృద్ధి పనులకు కృషి చేశారు. ప్రస్తుతం అవి పూర్తయ్యాయి.
సాగర్ నీరు వస్తే చాలు
ఆధునికీకరణ పనులు పూర్తయిన నేపథ్యంలో సాగర్ కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు ముసికి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. అలా నీరు ముసికి చేరితే మార్కాపురం, సంతనూతలపాడు, కొండపి, ఒంగోలు నియోజకవర్గాల్లోని అనేక గ్రామాలకు మేలు చేకూరనుంది. అధిక గ్రామాలు అటు కొండపి, ఇటు సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 60వేల మంది ప్రజానీకానికి తాగునీరు, వేలాది పశుసంపదకు అలాగే ఎండుతున్న పంటలకు నీటి లభ్యతతోపాటు భూగర్భ జలం కూడా పెరగనుంది. స్వల్ప వ్యయంతో అధిక మేలు దీనివల్ల ముసి పరివాహక ప్రాంత గ్రామాలకు జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ స్వామి తెలిపారు.