హైవే నిర్మాణం ఆలస్యంపై ఎంపీ ఆగ్రహం
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:25 PM
బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు ఆలస్యంపై బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని ముప్పవరం-మోదేపల్లి మధ్య సుమారు 18 కిలోమీటర్ల దూరం పనులను బుధవారం ఎంపీ కృష్ణప్రసాద్ పరిశీలించారు.
పనులు వేగవంతం చేయాలి
రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్
అద్దంకి,ఏప్రిల్8 (ఆంధ్రజ్యోతి) : బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు ఆలస్యంపై బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని ముప్పవరం-మోదేపల్లి మధ్య సుమారు 18 కిలోమీటర్ల దూరం పనులను బుధవారం ఎంపీ కృష్ణప్రసాద్ పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి జాతీయ రహదారి పనులు 7 శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. నెలవారీ సమీక్షలు పెట్టినా గత రెండెళ్లలో 41 శాతం మేర మా త్రమే పనులు పూర్తి చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు భూసేకరణ ఆలస్యం కారణంగా రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు చూపించటం నిజం కాదన్నారు. మొత్తం 18 కిలోమీటర్ల దూరంలో ఒక్క కిలోమీటర్ దూరం మాత్రమే భూసేకరణకు సంబంధించి సమస్య ఉందన్నారు. మిగిలిన చోట్ల కూడా పనులు ఆలస్యం కావటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ కు సంబంధించి వెంటనే రైతులకు పరిహారం చెల్లింపుపై దృష్టి సారించాలన్నారు. బీకేవీ గ్రీన్‌ఫీల్డ్ హైవే రాష్ర్టాభివృద్ధికి చాలా ముఖ్యం అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు తరచూ రివ్యూలు నిర్వహిస్తూ పనులు వేగవంతంగా చేయాలని ఆదేశిస్తున్నారన్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాలలో రైతులు ఎంపీ కృష్ణ ప్రసాద్‌ను కలిసి పరిహారం తదితర సమస్యలను వివరించారు. ఈ కార్య క్రమంలో పంగులూరు తహసీల్దార్ శింగరావు, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, టీం లీడర్ రమణారావు, జీఎం దాసరి రమేష్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.