ఐక్యంగా ముందుకు..
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:47 PM
గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే రానున్న స్థానిక సంస్థల సమరంలోనూ ఐక్యంగా సాగి జిల్లాలో నూరుశాతం విజయాలే లక్ష్యంగా పనిచేయాలని కూటమి పార్టీల నేతలు తీర్మానించుకున్నారు.
నూరుశాతం విజయాలు సాధిద్దాం
‘స్థానిక’ ఎన్నికలపై కూటమి పార్టీల తీర్మానం
ఇన్‌చార్జి మంత్రి ఆనం నేతృత్వంలో మూడు పార్టీల ముఖ్యనేతలు భేటీ
అర్బన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై అభిప్రాయ సేకరణ
కేటగిరీల వారీగా ముందుగానే అభ్యర్థులపై ఒక అంచనాకు రావాలని సూచన
ఒంగోలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే రానున్న స్థానిక సంస్థల సమరంలోనూ ఐక్యంగా సాగి జిల్లాలో నూరుశాతం విజయాలే లక్ష్యంగా పనిచేయాలని కూటమి పార్టీల నేతలు తీర్మానించుకున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహాలు, సమన్వయంపై శనివారం ఒంగోలులో టీడీపీ, జనసేన, బీజేపీల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. స్థానిక రామనగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన పరిశీలకుడు తిమ్మిరెడ్డి శివశంకర్, బీజేపీ రాష్ట్రనేత డాక్టర్ నిడమానూరి సూర్యకళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. టీడీపీ నుంచి పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, కందుల నారాయణరెడ్డి, ఎం.అశోక్‌రెడ్డి, దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జనసేన ఎన్నికల కమిటీ సభ్యులు పెదపూడి విజయకుమార్, రాయపాటి అరుణ, వరికూటి నాగరాజు, బీజేపీ ప్రకాశం, మార్కాపురం జిల్లాల అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, కృష్ణారావు హాజరయ్యారు. తొలుత అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో సంబంధిత ప్రజాప్రతినిధులతో ప్రధానంగా పరిశీలకులు చర్చించారు. ఆయా పట్టణాల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం, రాజకీయ పరిస్థితులపై పరిశీలకులు సమావేశంలోనూ, విడివిడిగానూ అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. అందరూ రాష్ట్ర పార్టీల ఆదేశానుసారం సమన్వయంతో ముందుకు సాగాలని ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. చిన్నచిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని నూరుశాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మునిసిపల్ చైర్మన్‌లు ఎక్కడ ఎవరికి రిజర్వేషన్ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్న దానిపై ఆరా తీసినట్లు తెలిసింది. అయితే రిజర్వేషన్‌లను రాష్ట్రస్థాయిలో నిర్ణయించనున్నందున ఒక్కో కేటగిరీకి ఇద్దరు, ముగ్గురు పేర్లను ముందుగానే ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకొని ఉండాలని సూచించారు. ఆ పేర్లను అధిష్ఠానానికి అవసరమైన సమయంలో తెలియజేయాలన్నారు. అంతిమంగా కార్పొరేషన్ మేయర్, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థులను అధిష్ఠానమే ఎంపిక చేస్తుందన్నారు. ఆయా పట్టణాల్లో జనసేన, బీజేపీ ఆశించే వార్డుల విషయమై కూడా కొంత చర్చ సాగినట్లు సమాచారం.