నీటి భద్రత కోసం ఉద్యమం
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:17 AM
జల సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమం సోమవారం జిల్లా అంతటా ప్రారంభమైంది. ఇది వందరోజులపాటు కొనసాగనుంది. సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో జలవనరుల శాఖ పర్యవేక్షణలో ఇతర సంబంధిత శాఖల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
జిల్లాలో జలధార కార్యక్రమానికి శ్రీకారం
వల్లూరు చెరువు వద్ద ప్రారంభించిన మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు
నియోజకవర్గానికి ఒకచోట నీటి సంఘాల అధ్యక్షుల సమక్షంలో చేపట్టిన అధికారులు
ఒంగోలు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి) : జల సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమం సోమవారం జిల్లా అంతటా ప్రారంభమైంది. ఇది వందరోజులపాటు కొనసాగనుంది. సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో జలవనరుల శాఖ పర్యవేక్షణలో ఇతర సంబంధిత శాఖల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ ప్రకారం జిల్లాలో నియోజకవర్గానికి ఒకచోట చెరువుల వద్ద సాగునీటి సంఘాల అధ్యక్షులు, స్థానిక రైతుల సమక్షంలో ప్రారంభించి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు మండలం వల్లూరు చెరువు వద్ద సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు, జలవనరులశాఖ ఎస్‌ఈ వరలక్ష్మి పాల్గొన్నారు. తొలుత వల్లూరమ్మ గుడిలో పూజలు నిర్వహించిన వారు అనంతరం అక్కడి చెరువులో జలహారతి ఇచ్చి పనులను ప్రారంభించారు. దర్శి నియోజకవర్గంలో పతకమూరు చెరువు వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం, కందుకూరు నియోజకవర్గంలో మోపాడు.. అద్దంకి నియోజకవర్గంలో భవనాశి చెరువు, సంతనూతలపాడు పెద్దచెరువు వద్ద ఆ పరిధిలోని నీటిసంఘాల అధ్యక్షుల సమక్షంలో అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా వంద రోజుల కార్యక్రమంలో తొలి పది రోజులపాటు పనులను గుర్తించాల్సి ఉంది. ఆతర్వాత అంచనాలు వేసి అనంతరం కలెక్టర్ నుంచి అనుమతులు పొంది ఈనెల 21 నుంచి 80 రోజులపాటు పనులు చేసే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చింది. తదనుగుణ చర్యలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టిసారించనున్నారు. జిల్లా స్థాయిలో జేసీ ఆధ్వర్యంలో కార్యక్రమ పర్యవేక్షణ సాగనుంది.