Share News

మూడోవంతుకుపైగా తిరస్కరణలే

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:11 AM

దక్షిణాది పొగాకు మార్కెట్లో బేళ్ల తిరస్కరణలకు బ్రేక్‌ పడటం లేదు. సోమవారం మార్కెట్‌లో కూడా వివిధ కారణాలతో 36.66 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అందులో నోబిడ్‌లే 30.12శాతం ఉన్నాయి.

మూడోవంతుకుపైగా తిరస్కరణలే

తెచ్చిన పొగాకు బేళ్లు 5,330.. కొనుగోలు చేసింది 3,376

ఎస్‌బీఎస్‌లో 37.78శాతం, ఎస్‌ఎల్‌ఎస్‌లో 24.49శాతం నోబిడ్లు

ఒంగోలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో బేళ్ల తిరస్కరణలకు బ్రేక్‌ పడటం లేదు. సోమవారం మార్కెట్‌లో కూడా వివిధ కారణాలతో 36.66 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అందులో నోబిడ్‌లే 30.12శాతం ఉన్నాయి. మరో ఆరు శాతానికిపైగా కొనుగోలు సరిగాలేక రైతులు, బయ్యర్లు తిరస్కరించారు. 11 కేంద్రాలకు మొత్తం 5,330 బేళ్లను వేలానికి తీసుకురాగా 3,376ను మాత్రమే కొనుగోలు చేశారు. అంటే వేలంకు తెచ్చిన వాటిలో 36.66శాతం బేళ్లు వివిధ కారణాలతో తిరస్కర ణకు గురయ్యాయి. అదేసమయంలో 1,672 నోబిడ్‌ అయ్యాయి. మొత్తం వేలంకు తెచ్చిన బేళ్లలో నోబిడ్‌లు 30.12శాతంగా ఉన్నాయి. ఎస్‌బీఎస్‌ రీజియన్‌ పరిధిలో ఐదు కేంద్రాలకు 2,790 బేళ్లు తీసుకురాగా 1,599 మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. అలా 1,191 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో 37.78శాతం అంటే 1,054 నోబిడ్‌ అయ్యాయి. ఒంగోలు-2లో 45.53శాతం నోబిడ్‌ కాగా, అవి కొండపిలో 40.99శాతం, వెల్లంపల్లిలో 37.26శాతంగా ఉన్నాయి. ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో మొత్తం 2,540 బేళ్లు వేలంకు తీసుకురాగా 1,777ను కొనుగోలు చేశారు. మిగిలిన 763 వివిధ కారణాలతో తిరస్కరించారు. మొత్తం బేళ్లలో 24.49శాతం అంటే 622 బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. గరిష్ఠంగా కనిగిరి కేంద్రంలో 51.83శాతం, పొదిలిలో 29.68 శాతం నోబిడ్‌ అయ్యాయి. అన్ని కేంద్రాల్లోనూ కిలో గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.160గా ఉంది. సగటు ధరలు పరిశీలిస్తే ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో సోమవారం మార్కెట్‌లో కిలో సగటున రూ.186.28, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో రూ.196.32గా ఉంది.

Updated Date - Jul 14 , 2026 | 03:11 AM