ఒంగోలు కలెక్టరేట్ ఆధునికీకరణ
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:25 PM
ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించనున్న వేడుకలకు జిల్లా పరిపాలన భవన్(కలెక్టరేట్) కూడా ముస్తాబవుతోంది
ముందుభాగంలో అడ్డదిడ్డంగా ఉన్నవి తొలగింపు
భవనానికి రంగులు వేసే ప్రక్రియ ప్రారంభం
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు మునిసిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించనున్న వేడుకలకు జిల్లా పరిపాలన భవన్(కలెక్టరేట్) కూడా ముస్తాబవుతోంది. ప్రకా శం భవనం ఏర్పడిన నాటి నుంచి చిన్న చిన్న మరమ్మతులు మినహా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా ఒంగోలు మునిసిపాలిటీ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రకాశం భవనాన్ని కూడా ముందుభాగంలో అన్ని హంగులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్ నిర్మించిన సమయంలోనే ఆ భవనాల ముందుభాగంలో అప్పట్లో వాహనాలు నిలిపేందుకు రోడ్డుకు కొంత పైభాగంగా సిమెంట్‌తో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వివిధ పనుల కోసం ఎక్కువమంది కలెక్టరేట్‌కు వస్తుండటంతో అక్కడ వాహనాల పార్కింగ్ చేయడం వల్ల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు కలెక్టరేట్‌కు నిరంతరం వివిధ పనుల కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో ఆ ప్రాంతంలో వాహనాలు నిలుపుదల లేకుండా చర్యలు తీసుకున్నారు. తాజాగా ముందు భాగంలో ఎక్స్‌కవేటర్‌తో పూర్తిస్థాయిలో చదును చేసే ప్రక్రియను చేపట్టారు. ఇంకొక వైపు కలెక్టరేట్‌కు రంగులు వేసేందుకు సిద్ధమయ్యారు. కలెక్టరేట్‌లో పూర్తిస్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.